బీచ్‌ కారిడార్‌కు ‘గ్రీన్‌’ కార్పెట్‌ | Sakshi
Sakshi News home page

బీచ్‌ కారిడార్‌కు ‘గ్రీన్‌’ కార్పెట్‌

Published Wed, Mar 22 2023 1:38 AM

-

సాక్షి, విశాఖపట్నం : పరిపాలన రాజధాని నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాఫీగా చేరుకునేలా ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సాగరతీరంలో ప్రకృతితో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఎయిర్‌పోర్టుకి గంటలోపే చేరుకునేలా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని మాస్టర్‌ప్లాన్‌ రోడ్డుగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బీచ్‌ కారిడార్‌లో భాగంగా గ్రీన్‌ బెల్ట్‌ అభివృద్ధికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 33 అడుగుల మేర అభివృద్ధి చేయనున్న గ్రీన్‌బెల్ట్‌ కోసం భూమిని ఇచ్చే వారికి టీడీఆర్‌(ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏవైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు తెలియజేయాలని స్పష్టం చేసింది.

ప్రత్యేక రహదారికి ముందడుగు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి భోగాపురం వెళ్లేందుకు ప్రత్యేక రహదారి నిర్మాణానికి ఒక్కో అడుగు పడుతోంది. ఇటీవల నగరంలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కేంద్ర జాతీయ రహదారులు శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బీచ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. నగరంలో ఎన్‌హెచ్‌–16 ఉన్నప్పటికీ.. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరో ప్రధాన రహదారి కచ్చితంగా అవసరమని భావించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రహదారిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. దీనికి అనుగుణంగా రాజధానికి రాచమార్గంగా కోస్టల్‌ హైవే నిర్మాణానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. బీచ్‌రోడ్డులో ఉన్న కోస్టల్‌ బ్యాటరీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వరకు మాస్టర్‌ప్లాన్‌ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ, ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, వీఎంఆర్‌డీఏ, విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ), జీవీఎంసీ సహకారంతో బీచ్‌ కారిడార్‌ని అభివృద్ధి చేయనున్నారు. ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి రహదారి నిర్మాణం చేపట్టాలని డీపీఆర్‌లో స్పష్టం చేశారు.

భూమికి తగిన టీడీఆర్‌ ఇస్తాం..

ఇందులో భాగంగానే కై లాసగిరి జంక్షన్‌ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ బీచ్‌కారిడార్‌లో ప్రతిపాదిత రైట్‌ ఆఫ్‌ వే(రో) అంచున గ్రీన్‌ బెల్ట్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ గ్రీన్‌ బెల్ట్‌ రానున్న 10 మీటర్ల మేర ఉన్న ప్రాంతంలో ఎవరివైనా భూములు ఉంటే.. ఆ భూ యజమానులు స్వయంగా ప్రభుత్వానికి అప్పగించినా.. లేదా.. వారే గ్రీన్‌బెల్ట్‌గా అభివృద్ధి చేసి ఇవ్వవచ్చని సూచించింది. ఎలా ఇచ్చినా సరే జీవో నం.223 ప్రకారం టీడీఆర్‌ పొందేందుకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ఐఎన్‌ఎస్‌ కళింగ, ఎర్రమట్టిదిబ్బలు, నీటి వనరులు, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న కొండలు మొదలైన ప్రాంతాల్లో ఉన్న భూములకు గ్రీన్‌బెల్ట్‌ అంశాలు వర్తించబోవంటూ మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వం సమయానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకోనుందని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి వెల్లడించారు. ఈ అంశాలపై ఎవరికై నా అభ్యంతరాలున్నా, సలహాలందించాలనుకున్నా నోటిఫికేషన్‌ జారీ చేసిన 15 రోజుల్లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీకి తెలియజేయాలని సూచించారు.

భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ ప్రత్యేక కారిడార్‌

కై లాసగిరి నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు 10 మీటర్ల వెడల్పున గ్రీన్‌ బెల్ట్‌

అభివృద్ధికి భూమినిచ్చిన వారికి టీడీఆర్‌ ఇవ్వాలని నిర్ణయం

అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్‌

Advertisement
Advertisement