విశాఖకే తలమానికం

23 Mar, 2023 08:42 IST|Sakshi

డాబాగార్డెన్స్‌: విశాఖ నగరంలో జీ–20 సదస్సు నిర్వహించడం గర్వకారణంగా భావిస్తున్నట్టు మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. జీ–20 సమ్మిట్‌ ఏర్పాట్లు, అతిథులు, పర్యాటకులకు కల్పించిన సౌకర్యాలపై బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇక్కడి ప్రజలు తరఫున కృతజ్ఞతలు. జీ–20 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అద్భుతం. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం.

షీలానగర్‌ నుంచి ఎన్‌ఏడీ, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వరకు కోట్లాది రూపాయలతో సుందరీకరణ పనులతో పాటు రోడ్లు, విద్యుత్‌ అలంకరణ, ఆకర్షణీయమైన పెయింటింగ్‌ పనులు చేపట్టాం. సాగరతీరంలో కోస్టల్‌ బ్యాటరీ నుంచి రాడిసన్‌ హోటల్‌ వరకు విశాఖ తీర అందాలు అతిథులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. ఆర్‌.కె.బీచ్‌, సాగర్‌నగర్‌, గుడ్లవానిపాలెం, సీతకొండ తదితర ప్రాంతాల్లో వ్యూ పాయింట్లను అతిథులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా రూపొందించాం. ప్రాంతాలు తెలిపే సూచిక బోర్డుల ఏర్పాటు, వేలాడుతున్న కేబుల్‌ వైర్లను తొలగించాం. ఎక్కడా వ్యర్థాలు లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా పలు ప్రాంతాలను తీర్చిదిద్దాం.’అని మేయర్‌ వివరించారు.

ప్రజల భాగస్వామ్యం కావాలి
‘జీ–20 సదస్సు విశాఖకే తలమానికం. విశాఖ నగర పౌరులుగా గొప్ప కార్యక్రమంలో భాగస్వాములవుదాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుదాం. దేశ విదేశీ ప్రతినిధులకు మన సంస్కృతి, సంప్రదాయాలను చూపిద్దాం.’అని మేయర్‌ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ‘యోగా ఆల్‌ పేరిట వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌, వుడా పార్కులో యోగా తరగతులు నిర్వహించాం.

‘మాక్‌ జీ–20 కాన్‌క్లేవ్‌’పేరిట బుధవారం విద్యార్థులతో సదస్సు చేపట్టాం. 24న సాగరతీర స్వచ్ఛత పేరిట బీచ్‌ క్లీనింగ్‌, 25న చిత్రలేఖనం పోటీలు, 26న వైజాగ్‌ సిటీ మారథాన్‌, వైజాగ్‌ కార్నివాల్‌ పేరిట థింసా, కోలాటం, వీరనాట్యం, కూచిపూడి వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు ముడసర్లోవలోని సోలార్‌ ప్రాజెక్టు, కాపులుప్పాడలోని జిందాల్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్‌, జీవీఎంసీలోని కమాండ్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌, తాగునీటి ప్రాజెక్టు, కై లాసగిరి, ఆర్కేబీచ్‌ తదితర ప్రాంతాలను తిలకించనున్నారు’అని మేయర్‌ తెలిపారు.

కోట్లాది రూపాయలతో నగర సుందరీకరణ
‘రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జీ–20 సదస్సుకు సంబంధించి కోట్లాది రూపాయలతో చేపట్టిన సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జోన్‌–1 పరిధిలో రూ.412.86 లక్షలతో 20 పనులు, జోన్‌–2 పరిధిలో రూ.1353.77 లక్షలతో 73 పనులు, జోన్‌–3 పరిధిలో 1371.62 లక్షలతో 59 పనులు, జోన్‌–4 పరిధిలో 1908.65 లక్షలతో 35 పనులు, జోన్‌–5 పరిధి–ఏలో 752.44 లక్షలతో 33 పనులు, బిలో రూ.169.91 లక్షలతో 11 పనులు, జోన్‌–8 పరిధిలో రూ.1908.89 లక్షలతో 27 అభివృద్ధి పనులు ప్రారంభించాం.

ఇందులో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. విద్యుత్‌కు సంబంధించి రూ.1168.47 లక్షలతో 56 పనులు, మెకానికల్‌కు సంబంధించి 287.41 లక్షలతో 4 పనులు, పీడీ–1కి సంబంధించి రూ.932.25 లక్షలతో 12 పనులు, పీఎల్‌ అండ్‌ సీకి సంబంధించి రూ.878.99 లక్షలతో 53 పనులు జరుగుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 70 శాతం పైబడి పనులు పూర్తయ్యాయి’ అని మేయర్‌ వివరించారు.

హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
‘జీ–20
సదస్సుకు విశాఖ వేదికగా నిలవడం సంతోషంగా ఉంది. ఈ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. విదేశాంగ మంత్రులు, రాయబారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండు స్టార్‌ హోటళ్లలో సమ్మిట్‌ జరగనుంది. అతిథుల కోసం నగరంలోని వివిధ స్టార్‌ హాటళ్లలో 300 గదులు బుక్‌ చేశారు. హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు.’ అని మేయర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు