కానుకలొచ్చేశాయ్‌! | Sakshi
Sakshi News home page

కానుకలొచ్చేశాయ్‌!

Published Fri, May 26 2023 12:32 AM

ద్వారకానగర్‌లోని స్టాక్‌ పాయింట్‌లో నిల్వ చేసిన నోట్‌ పుస్తకాలు - Sakshi

● స్టాక్‌ పాయింట్లలో జగనన్న విద్యాకానుకలు ● తరగతుల వారీగా వస్తువుల విభజన ● స్కూళ్లకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు ● బడితెరిచిన రోజునే పంపిణీ ● జిల్లాలో 1.02 లక్షల మందికి ప్రయోజనం

విశాఖ విద్య: బడితెరిచిన తొలిరోజునే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో గుర్తించిన స్టాక్‌ పాయింట్లలో ఇప్పటికే జగనన్న విద్యాకానుక వస్తువులు నిల్వ చేశారు. ఇక్కడ నుంచి స్కూల్‌ పాయింట్‌కు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని గతేడాది ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 1,01,370 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందించగా, ఈ ఏడాది కొత్తగా అడ్మిషన్లు పొందిన వారికి సైతం తొలిరోజునే కానుక పంపిణీ చేసేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 1.02 లక్షల మందికి పంపిణీ చేయాలనే ముందస్తు అంచనాతో కానుకలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

కానుకలో 8 రకాల వస్తువులు

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకునే విద్యార్థి చదువుకు అవసరమైన అన్ని రకాల సామగ్రిని ఉచితంగానే అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విద్యార్థులకు అందించే విద్యాకానుక కిట్‌లో 8 రకాల వస్తువులు ఉంటాయి. మూడు జతల యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, ఇంగ్లీషు డిక్షనరీ, ఒక బెల్ట్‌, షూస్‌, రెండు జతల సాక్స్‌ను బ్యాగులో పెట్టి విద్యార్థులందరికీ జగనన్న కానుక అందజేయనున్నారు.

నాణ్యతపై ముందుగానే తనిఖీ

జిల్లాలోని ఆనందపురం, భీమునిపట్నం, చినగదిలి, గాజువాక, పద్మనాభం, పెదగంట్యాడ, పెందుర్తి మండల కేంద్రాల్లో స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. విశాఖ అర్బన్‌లో ఎక్కువగా పాఠశాలలు ఉన్నందున ఇక్కడ మూడు స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. గాజువాక వడ్లపూడిలో ఉన్న గోదాము నుంచి పాఠ్యపుస్తకాలను స్కూల్‌పాయింట్లకు చేర్చుతున్నారు. నోట్‌ బుక్స్‌, బెల్ట్‌, షూస్‌, డిక్షనరీ, సాక్స్‌ , బ్యాగులు స్టాక్‌ పాయింట్లకు సరఫరా అయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లోనే యూనిఫారాలు సరఫరా కానున్నాయి. స్టాక్‌ పాయింట్‌కు వచ్చిన వస్తువులను సీఆర్పీలతో ముందుగానే పరిశీలించారు.

స్కూళ్లకే నేరుగా సరఫరా..

మండల కేంద్రాల్లో ఉన్న స్టాక్‌ పాయింట్ల నుంచి జననన్న విద్యాకానుక కిట్లను నేరుగా స్కూళ్లకు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్టాక్‌ పాయింట్లలోనే వస్తువులన్నీ బ్యాగులో పెట్టి కిట్‌ రూపంలో సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసమని సీఆర్పీలను వినియోగిస్తున్నారు. కిట్‌ తయారీలో భాగంగా విధులు కేటాయించే వారికి రోజుకు రూ.100ల చొప్పున అందించేందుకు నిధులు కేటాయించారు.

సిద్ధం చేస్తున్నాం

ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా విద్యాకానుక కిట్లు సిద్ధం చేస్తున్నాం. ఇంకా యూనిఫారాలు రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో స్టాక్‌ పాయింట్లకు సరఫరా అవుతుందనే సమాచారం వచ్చింది. స్టాక్‌ పాయింట్లు నుంచి స్కూళ్లకు సరఫరా చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం.

– శిరీషారాణి,

సీఎంవో, సమగ్ర శిక్ష, విశాఖ జిల్లా

విద్యాకానుక వస్తువుల ప్యాకింగ్‌ చేస్తున్న సిబ్బంది
1/1

విద్యాకానుక వస్తువుల ప్యాకింగ్‌ చేస్తున్న సిబ్బంది

Advertisement
Advertisement