502 అడుగుల ఎత్తులో చేజారిన పరిస్థితులు.. ట్రైనీ పైలట్‌ను తప్పించి ప్రాణత్యాగం | Sakshi
Sakshi News home page

502 అడుగుల ఎత్తులో చేజారిన పరిస్థితులు.. ట్రైనీ పైలట్‌ను తప్పించి ప్రాణత్యాగం

Published Thu, Jun 1 2023 8:20 AM

- - Sakshi

2020 నవంబర్‌ 26..
గోవా సాగరజలాల్లో ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య నుంచి.. రయ్‌మంటూ గాల్లోకి మిగ్‌–29కి చెందిన మిగ్‌ 677 యుద్ధ విమానం దూసుకెళ్లింది. కొత్తగా నౌకాదళంలో చేరిన వారికి యుద్ధ విమానాలు నడిపే అంశంపై శిక్షణలో భాగంగా.. మిగ్‌ 677 విమానాన్ని అత్యంత అనుభవజ్ఞుడైన కమాండర్‌ నిశాంత్‌ సింగ్‌ నడుపుతూ కోపైలట్‌కు శిక్షణ అందిస్తున్నారు. 1500 గంటలకు పైగా.. మిగ్‌ విమానాల్ని నడిపిన అనుభవం ఉన్న నిశాంత్‌.. శిక్షణ అందిస్తున్న సమయంలో సాయంత్రం 4.27 గంటల సమయంలో మిగ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

ఒక్కసారిగా తలెత్తిన ఈ హఠాత్పరిణామం నుంచి తప్పించుకునేందుకు నిశాంత్‌ తన శాయశక్తులా ప్రయత్నించారు. 15 వేల అడుగుల ఎత్తు నుంచి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. కిందకి వస్తూ ఉన్నారు. దాదాపు 502 అడుగుల ఎత్తులో పరిస్థితులు చేజారిపోయినట్లు గుర్తించారు. వెంటనే ట్రైనీ పైలట్‌ ను విమానం నుంచి తప్పించేసిన నిశాంత్‌.. తన ప్రాణాల్ని మాత్రం కాపాడుకోలేక దేశం కోసం తుదిశ్వాస విడిచారు. అందుకే నిశాంత్‌కు శౌర్య పతకం వరించింది.

2021.. సెప్టెంబర్‌ 26.. ఉదయం 8 గంటలు..
జమ్మూకాశ్మీర్‌లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న 14 రాష్ట్రీయ రైఫిల్‌ బెటాలియన్‌ సెక్టార్‌–3లోని ఒక ఇంట్లో ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. వెంటనే మార్కోస్‌ బృందానికి సమాచారం అందించారు. వినీత్‌కుమార్‌తో సహా మార్కోస్‌ బృందం ఉగ్రవాదులున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఖాన్‌ మొహల్లా, వాట్రినా అనే ఇద్దరు ఉగ్రవాదులున్న ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లుని మార్కోస్‌ బృందం ఆక్రమించింది. ఉగ్రవాదులు నేరుగా కాల్పులు జరిపేందుకు వీలుగా ఉన్న ఇంటి పైకప్పుపైకి ప్రమాదం అని తెలిసినా.. టెర్రరిస్టుల్ని మట్టుపెట్టడమే లక్ష్యంగా వినీత్‌కుమార్‌, మనీష్‌ చౌహాన్‌ పైకి వెళ్లారు. 9.30 గంటల సమయంలో టెర్రరిస్టులు గ్రానైడ్లతో దాడి చేయడంతో పాటు ఏకకాలంలో ఫైరింగ్‌ చేశారు.

ఈ క్రమంలో రైఫిల్‌ మ్యాన్‌ మనీష్‌ చౌహాన్‌కు గాయాలయ్యాయి. గ్రానైడ్‌ పేలుడుతో వచ్చిన అగ్ని కీలల నుంచి తప్పించుకున్న వినీత్‌కుమార్‌.. ఉగ్రవాదుల్ని ట్రాక్‌ చేస్తూ.. వారున్న ఇంటిపైకి దూసుకెళ్లారు. ఫైరింగ్‌ తర్వాత రెండు గంటల పాటు మౌనంగా ఉన్న టెర్రరిస్టులు మరోసారి దాడికి ప్రయత్నించారు. ఈలోపునే.. వారిని ట్రాక్‌ చేసుకున్న వినీత్‌కుమార్‌.. ప్రాణాలకు తెగించి.. ఉగ్రవాదులపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. ఉగ్రమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన వినీత్‌కుమార్‌కు అత్యుత్తమమైన శౌర్య పతకం(గ్యాలంట్రీ మెడల్‌) వరించింది.

ఇలా ఒక్కొక్కరిదీ.. ఒక్కో విజయగాధ..
శత్రుదేశాల నుంచి దేశాన్ని రక్షిస్తూ.. పౌరులు జీవితాలు ప్రశాంతంగా సాగేందుకు శ్రమిస్తున్న నౌకాదళ అధికారులు, సిబ్బంది ధైర్య సాహసాలకు గుర్తింపుగా అత్యుత్తమ సేవా పతకాలతో ఇండియన్‌ నేవీ సత్కరించింది. 33 మందికి శౌర్య, నవ్‌సేనా, విశిష్ట సేవా, కెప్టెన్‌ రవిధీర్‌ మెమొరియల్‌, లెఫ్టినెంట వీకే జైన్‌ మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్స్‌, జీవన్‌ రక్షా పదక్‌ అవార్డులను భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ చేతుల మీదుగా ప్రదానం చేశారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో నేవల్‌ ఇన్వెస్టిచర్‌ సెరమనీ –2023ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

నౌకాదళాధికారులు, సెయిలర్స్‌, యుద్ధ నౌకలు, సబ్‌మైరెన్ల సారధులు, నేవీ కుటుంబాల సమక్షంలో పతకాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ హితంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నౌకల నిర్వహణ సాగిస్తున్న విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డు... బెస్ట్‌ గ్రీన్‌ ప్రాక్టీస్‌–2023 ఇండస్ట్రియల్‌ విభాగంలో సీఎన్‌ఎస్‌ ట్రోఫీని దక్కించుకుంది. – సాక్షి, విశాఖపట్నం

Advertisement
Advertisement