‘ఢిల్లీ’కి ఫుల్‌ డిమాండ్‌!.. తరువాత ముంబైకి గిరాకీ | Sakshi
Sakshi News home page

Vishakapatnam To Delhi: ‘ఢిల్లీ’కి ఫుల్‌ డిమాండ్, తరువాత ముంబై!

Published Wed, Aug 16 2023 1:08 AM

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం–ఢిల్లీల మధ్య నడిచే విమానాలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటోంది. మరే విమాన సర్వీసుకు లేని ప్రయాణికుల తాకిడి వీటికి కనిపిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య రోజుకు ఐదు సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి ఉదయం 8.15 నుంచి రాత్రి 9.50 గంటల వరకు తిరుగుతున్నాయి. వీటిలో సీట్లు 95 శాతానికి పైగా నిండుతున్నాయి. ఒక్కోసారి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 100 శాతం కూడా ఉంటోంది.

ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రెండు రోజుల ముందుగా టికెట్లు దొరకడం లేదు. ఆ తర్వాత స్థానం విశాఖపట్నం–ముంబై విమాన సర్వీసులకు ఉంది. ఈ రెండు నగరాల మధ్య 90 శాతం పైగా ఓఆర్‌ ఉంటోంది. ఈ విమాన సర్వీసులకు కూడా ఒకట్రెండు రోజుల ముందుగా టికెట్లు లభించని పరిస్థితి ఉంది. ఇక విశాఖపట్నం–సింగపూర్‌ సర్వీసుకు కూడా మంచి గిరాకీ కనిపిస్తోంది.

ఈ విమాన సర్వీసుకు 80 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఒక్క ఇంటర్నేషనల్‌ సర్వీసు మాత్రమే నడుస్తోంది. అందువల్ల ఇతర దేశాలకు వెళ్లాలంటే విశాఖ నుంచి నేరుగా విమానాలు లేవు. ఢిల్లీ, ముంబైల నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు కనెక్టివిటీ ఉంది. దీంతో ఇక్కడ నుంచి డొమెస్టిక్‌ సర్వీసుల్లో ఢిల్లీ, ముంబైలకు వెళ్లి అక్కడ నుంచి ఆయా దేశాలకు విమానాల్లో చేరుకుంటున్నారు. ఫలితంగా ఈ విశాఖ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగ, వ్యాపార అవసరాలతో పాటు పర్యాటకంలో భాగంగా పెద్ద సంఖ్యలో విదేశాలకు రాకపోకలు సాగించే వారున్నారు. దీంతో ఈ నగరాల మధ్య ప్రయాణికుల రద్దీ పెరగడానికి దోహదపడుతోంది. విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాల్లో ఢిల్లీ, ముంబై సర్వీసులకు అధిక డిమాండ్‌ ఉండడానికి ఇదే కారణమని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎస్‌. రాజారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీకనుగుణంగా తగినన్ని సర్వీసులు పెంచేందుకు విమానాల కొరత ఉందని విమానయాన నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement