ఉత్తరాంధ్రలో మరో భారీ మోసం.. విదేశీ ఉద్యోగాల పేరుతో.. | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రలో మరో భారీ మోసం.. విదేశీ ఉద్యోగాల పేరుతో..

Published Tue, Sep 5 2023 1:18 AM

గోడు వెళ్లబోసుకుంటున్న నిరుద్యోగులు  - Sakshi

విశాఖపట్నం: స్వీడన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమృత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నిరుద్యోగులకు టోకరా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా కడప తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు సోమవారం నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. దొండపర్తిలోని టీఎస్‌ఎన్‌ కాలనీలో అమృత్‌ ఎంటర్‌ప్రైజస్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు.

​​​​​​​

అది నమ్మి కార్యాలయానికి ఫోన్‌ చేసిన వారికి అర్హత గల ఉద్యోగాలు ఇప్పిస్తామని.. అందుకు డబ్బు లు చెల్లించాలని మేనేజర్లు శాంతి, లలిత నమ్మించారు. అలాగే నీరజ్‌, సౌరభ్‌ తెరవెనుక ఉండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ, కడప, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు చొప్పున రూ.కోటి వరకు ఆన్‌లైన్‌లో వసూలు చేశారు.

డబ్బులు చెల్లించినట్లు మేనేజర్లు నిరుద్యోగులకు రసీదులతో పాటు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందజేశారు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో కొంతమంది దొండపర్తిలోని అమృత్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు వెళ్లారు. కార్యాలయం మూసివేసి ఉండడంతో.. సంస్థ బోర్డు తిప్పేసినట్లు గ్రహించి ఆందోళనకు గురయ్యారు. దీనిపై బాధితులు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement