నాణ్యత పాటించకపోతే మెమోలివ్వండి | Sakshi
Sakshi News home page

నాణ్యత పాటించకపోతే మెమోలివ్వండి

Published Fri, Nov 10 2023 4:48 AM

అడవివరం హైస్కూల్‌లో భోజనాన్ని తనిఖీ చేస్తున్న ఆహార కమిషన్‌ సభ్యుడు లక్ష్మీరెడ్డి - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విద్యార్థుల భోజన విషయంలో నాణ్యత పాటించకపోయినా.. స్టాక్‌కు అనుగుణంగా రేషన్‌ దుకాణాల్లో సరకులు లేకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్య ప్రకాష్‌రావు, ఇతర శాఖల అధికారులతో కలిసి లక్ష్మిరెడ్డి చినగదిలి, అంబేడ్కర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లోని పలు రేషన్‌ డిపోలను, రేషన్‌ పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. అంబేడ్కర్‌ నగర్‌లోని 228 నంబర్‌ రేషన్‌ డిపోలో స్టాక్‌తో పోల్చితే ఐదు క్వింటాల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్‌ సభ్యుడు రేషన్‌ షాప్‌పై 6ఏ కేసు నమోదు చేయాలని డీఎస్‌వోకు ఆదేశించారు. స్టాక్‌ సరిపడా లేకపోవడం, రిజిస్టర్‌ నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీ వాహనంలో పంచదార, గోధుమ పిండి స్టాక్‌లోనూ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. పంపిణీ వాహనదారుడు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి.. తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరిలోవ అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న వాటికంటే అదనంగా గుడ్లు ఉండటంతో సూపర్‌వైజర్‌, అంగన్‌వాడీ సహాయకురాలికి మెమో జారీ చేయాలని ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశ్వరిని ఆదేశించారు. అడవివరంలోని జెడ్పీ హైస్కూల్‌లో భోజనం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అడివివరంలోనీ పూలే వసతి గృహంలో పిల్లలకు అందిస్తున్న భోజన విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కందిపప్పు, ఇతర సరకులు నాణ్యత లేనివి వినియోగిస్తున్నారని.. వాటిని పరీక్షించాలని జిల్లా ఫుడ్‌ కంట్రోలర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డీఎం రాజేశ్వరి, డీఈవో చంద్రకళ, లీగల్‌మెట్రాలజీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు లక్ష్మీరెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement