బీఆర్‌టీఎస్‌ బాధితులందరికీ న్యాయం | Sakshi
Sakshi News home page

బీఆర్‌టీఎస్‌ బాధితులందరికీ న్యాయం

Published Sat, Nov 11 2023 12:48 AM

బాధితుడికి చెక్కు అందజేస్తున్న జీవీఎంసీ చీఫ్‌ సిటీప్లానర్‌ సురేష్‌, అధికారులు - Sakshi

జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ సురేష్‌

సింహాచలం: అడవివరంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తొలి పావంచా నుంచి పాత అడవివరం వరకు బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణ బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ సురేష్‌ హామీ ఇచ్చారు. జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశాలతో బాధితులకు శుక్రవారం నష్ట పరిహారం చెక్కులు అందించారు. అయితే కొంత మంది చెక్కులు తీసుకునేందుకు నిరాకరించారు. తమకు సరైన న్యాయం చేయడం లేదని.. న్యాయం జరిగిన తర్వాతే చెక్కులు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో అధికారులు, బాధితుల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం చీఫ్‌ సిటీ ప్లానర్‌ విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకే తామంతా కృషి చేస్తున్నామన్నారు. బాధితులపై ఎటువంటి ఒత్తిడి చేయడం లేదన్నారు. రోడ్డు విస్తరణ జరగడం వల్ల చేకూరే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ట్రాఫిక్‌ పెరుగుతున్న దృష్ట్యా.. గిరి ప్రదక్షిణ, తదితర ఉత్సవాల కారణంగా తొలిపావంచా నుంచి పాత అడవివరం వరకు ఉన్న రోడ్డును సత్వరం విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఓనర్‌షిప్‌లు లేకపోయినా బాధితులందరికీ టీడీఆర్‌లు ఇస్తున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణ నష్టపరిహారం కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయే వారికి సంబంధించి ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇచ్చే విషయం రెవెన్యూ పరిధిలో ఉందన్నారు. కాగా.. బాధితులు ఇటీవల కలెక్టర్‌ మల్లికార్జునను కలిసి తమ సమస్యలు వివరించారు. కార్యక్రమంలో నగర డీసీపీ పద్మజ, సీపీ మహాలక్ష్మిదొర, బీఆర్‌టీఎస్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ చక్రవర్తి, జోన్‌–8 కమిషనర్‌ మల్లయ్యనాయుడు, ఏసీపీలు వెంకటేశ్వరరావు, రఘునాథరావు, టీపీవో తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement