క్షేమంగా చేరుకున్న మత్స్యకారులు | Sakshi
Sakshi News home page

క్షేమంగా చేరుకున్న మత్స్యకారులు

Published Sat, Nov 11 2023 12:48 AM

స్వగ్రామానికి చేరుకున్న మత్స్యకారులు - Sakshi

పరవాడ: తిక్కవానిపాలేనికి చెందిన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి 10 గంటలకు గ్రామానికి చెందిన దూడ నూకాలు, గంగులు, చేపల అప్పారావు, మహాలక్ష్మి, చేపల ముసలయ్య, పరదేశి ఒకే బోటులో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. రాత్రి సమయంలో పడవ కొంత ప్రయాణించిన తర్వాత ఇంజినీర్‌ మరమ్మతులకు గురైంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ రాక బహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వీచిన గాలులతో పడవ ఎటు ప్రయాణిస్తుందో అంతుచిక్కక వారు ఆందోళనలో పడ్డారు. తెల్లవారే సరిగి నడి సముద్రంలో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే వారి వద్ద ఉన్న మంచి నీరు తాగేశారు. తినడానికి, తాగడానికి ఎటువంటి ఆహార పానీయాలు లేక రెండు రోజుల పాటు ఆకలితో అల్లాడిపోయారు. రేవు పోలవరం తీరానికి చాలా దూరంలో ఉండగా సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ రావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం రాత్రి 12 గంటలకు బంగారమ్మపాలెం తీరానికి చేరుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు పడవతో పాటు మెకానిక్‌ను వెంటబెట్టుకుని శుక్రవారం ఉదయానికి బంగారమ్మపాలెం తీరానికి చేరుకున్నారు. ఇంజిన్‌కు మరమ్మతులు చేసి.. ఉదయం 10 గంటలకు మత్స్యకారులంతా క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారని సర్పంచ్‌ చేపల మసేను వెల్లడించారు.

Advertisement
Advertisement