పుస్తకం విలువ చాటేలా..! | Sakshi
Sakshi News home page

పుస్తకం విలువ చాటేలా..!

Published Tue, Nov 14 2023 12:42 AM

పోస్టరు ఆవిష్కరిస్తున్న వెంకటరావు, తదితరులు  - Sakshi

● నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు ● ఈ నెల 20 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

డాబాగార్డెన్స్‌/విశాఖ విద్య: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్‌.సి.హెచ్‌.వెంకటరావు తెలిపారు. సోమవారం గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో వారోత్సవాల ప్రచార పోస్టర్లు, బ్యానర్స్‌, కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సిబ్బంది, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వివరాలను వెల్లడించారు. విశాఖ నగరంలోని సూర్యబాగ్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వేదికగా వారోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు

వారోత్సవాల షెడ్యూల్‌ ఇదీ...

● ఈ నెల 14న బాలల దినోత్సవం రోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభిస్తారు.

● 15న పుస్తక ప్రదర్శనతోపాటు మాదక ద్రవ్యాల నిరోధకంపై అవగాహన కార్యక్రమం, పుస్తక పఠనం ప్రాముఖ్యతపై సెమినార్‌ నిర్వహించనున్నారు.

● 16న ఉదయం 10 గంటలకు గ్రంథాలయ ఉద్యమకారుల సంస్మరణ దినోత్సవం, గ్రంథాలయ ఉద్యమ నాయకులు డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రంగనాథం, అయ్యంకి వెంకటమరణయ్య, పాతూరి నాగభూషణం తదితరులకు నివాళులర్పించుట, గ్రంథ పాలకుల సదస్సు నిర్వహించనున్నారు. అనంతరం లైబ్రేరియన్‌ ఎన్‌ఎల్‌ రాజేంద్రవర్మ నిర్వహణలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘విజ్ఞానం పెంపొందించడంలో గ్రంథాలయాల పాత్ర’పై వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు.

● 17న సాయంత్రం గరిమ సాంస్కతిక వేదిక సారథ్యంలో కవి సమ్మేళనం.

● 18న గ్రంథాలయ సభ్యత్వ దరావతు స్వీకరణ. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆటలు, దేశభక్తి గేయాల పోటీలు.

● 19న ఉదయం 10 గంటలకు గరిమ సాంస్కృతిక వేదిక సారథ్యంలో మహిళా దినోత్సవం నిర్వహణ. దిశ చట్టం, మహిళా సాధికారితపై సదస్సు.

● 20న ఉదయం శ్ఙ్రీవుయ్‌ లవ్‌ రీడింగ్‌శ్రీశ్రీలో భాగంగా సామూహిక స్వీయ పుస్తక పఠనం, అనంతరం 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తారు.

నేడు వారోత్సవాలు ప్రారంభం

గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారం ప్రారంభించనున్నామని, బాలల దినోత్సవం, జాతీయ పతాకావిష్కరణ నిర్వహించనున్నట్లు గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్‌.సి.హెచ్‌. వెంకటరావు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్‌పర్సన్‌ కొండా రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌.చంద్రకళ, వయోజన విద్యాశాఖ సంచాలకుడు ఎస్‌.సుబ్రహ్మణ్యం, జిల్లా పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకుడు వి.మణిరామ్‌, జిల్లా పంచాయతీ అధికారి ఎం.శ్రీనివాసరావు, జిల్లా కేంద్ర గ్రంథాలయం ఇన్‌చార్జి, ఉప గ్రంథాలయ అధికారి పి.వి.నూకరాజు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ, జిల్లా గ్రంథాలయ కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు.

Advertisement
Advertisement