సముద్ర జలాల కాలుష్య నియంత్రణకు నివేదిక ఇవ్వండి | Sakshi
Sakshi News home page

సముద్ర జలాల కాలుష్య నియంత్రణకు నివేదిక ఇవ్వండి

Published Fri, Nov 17 2023 12:42 AM

సమావేశంలో మాట్లాడుతున్న వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున - Sakshi

దొండపర్తి : సముద్రంలోకి ప్రవహించే వ్యర్థాలు, మురుగునీటితో సముద్ర జలాలు కలుషితం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన సముద్ర జలాలు కలుషితం కాకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై కమిటీ సమావేశం నిర్వహించారు. కొత్త ఎస్‌టీపీలు/ఈటీపీలు నిర్మించడం ద్వారా లేదా ఇప్పటికే ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్‌ సభ్యులకు సూచించారు. సముద్ర జలాలు కలుషితం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని సభ్యులకు సూచించారు. జీవీఎంసీ, విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ ద్వారా నిర్వహిస్తున్న 18 మురుగునీటి శుద్ధి కర్మాగారాల ఇన్‌లెట్‌, అవుట్‌లెట్లు వ్యర్థాలు/మురుగునీటిని సమర్థవంతంగా శుద్ధి చేయడానికి సరిపోతాయన్నారు. అయితే ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్తులో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలో అదనపు మురుగునీరు/ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన స్థలాలను కూడా కమిటీ సూచించాలన్నారు. వీటిపై నాలుగు వారాల్లోగా హైకోర్టు నివేదిక కోరినందున, వీలైనంత త్వరగా తమకు నివేదిక అందజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త డి.సౌమ్య, కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ జి.నాగిరెడ్డి, ఏయూ సివిల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ప్రొఫెసర్‌ వజీర్‌ మహ్మద్‌, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌, కలెక్టర్‌ మల్లికార్జున

Advertisement
Advertisement