అందుబాటులోకి ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

Published Fri, Nov 17 2023 12:42 AM

ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ - Sakshi

● నిర్వహణ బాధ్యతలు ఏజెన్సీకి అప్పగింత ● నెలకు ఒక్కొక్కరికి ఫీజు: పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.500

డాబాగార్డెన్స్‌: అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్‌రోడ్డులో సిద్ధం చేసిన ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నగర ప్రజలు, క్రీడాకారులకు అందుబాటులో ఉంచినట్లు జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్వహణలో లోపాలు కారణంగా భారీ మరమ్మతులకు గురై.. కొన్నాళ్లు మూతపడిందన్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టామన్నారు. రేసింగ్‌ పూల్‌, డైవింగ్‌ పూల్‌, బేబీ పూల్‌ను అత్యాధునికంగా ఆధునికీకరించినట్లు వెల్లడించారు. గత అనుభవాల దృష్ట్యా.. కాంప్లెక్స్‌ నిర్వహణ బాధ్యతలను టెండర్‌ ప్రక్రియ ద్వారా అనుభవం గల ఏజెన్సీని ఎంపిక చేసి.. మూడేళ్ల కాల పరిమితికి అప్పగించినట్లు చెప్పారు. కాంప్లెక్స్‌ నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, సాంకేతిక సిబ్బంది, స్విమ్మింగ్‌ కోచ్‌ జీతాలు, విద్యుత్‌, నీటి చార్జీలను ఏజెన్సీయే భరించాల్సి ఉంటుందన్నారు. ప్రజల నుంచి అధిక ఫీజు వసూలు చేయకూడదని నిబంధన విధించినట్లు స్పష్టం చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా పెద్దలు ఒక్కరికీ నెలకు రూ.750, పిల్లలు ఒక్కొక్కరికి నెలకు రూ.500గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వర కు ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ అందుబాటులో ఉంటుందని.. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కమిషనర్‌ కోరారు.

Advertisement
Advertisement