ఆటోనగర్‌గా ‘కణమాం’! | Sakshi
Sakshi News home page

ఆటోనగర్‌గా ‘కణమాం’!

Published Mon, Nov 20 2023 1:06 AM

కణమాంలో ప్రతిపాదిత ఎంఎస్‌ఎంఈ పార్కు స్థలం  - Sakshi

● ఈ ఎంఎస్‌ఎంఈ పార్కుకు 157.77 ఎకరాల కేటాయింపు ● భూమిని ఏపీఐఐసీకి స్వాధీనం చేసిన రెవెన్యూ శాఖ ● త్వరలో లేఅవుట్‌ వేసేందుకు సన్నాహాలు

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపాదిత కణమాం ఎంఎస్‌ఎంఈ పార్కును ఆటోనగర్‌గా మార్పు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆనందపురం మండలం కణమాం గ్రామం వద్ద ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పార్కు కోసం 157.77 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా కేటాయించింది. ఈ భూమిని రెవెన్యూ శాఖ ఏపీఐఐసీకి ఇటీవల స్వాధీనం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీఐఐసీ అధికారులు ఆ భూమిని చదును చేయించే పనిని చేపట్టారు. అక్కడ లేఅవుట్‌ వేసేందుకు అంచనాలు రూపొందించారు. ఇందుకు అనుమతి కోరుతూ ఏపీఐఐసీ ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. అటు నుంచి అనుమతులు రాగానే లేఅవుట్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. అలాగే అక్కడ కొత్తగా యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే వారికి 200, 500, 1,000 గజాల చొప్పున ప్లాట్లను కేటాయించాల్సి ఉంటుంది. వాటి విస్తీర్ణంతో పాటు ధరను నిర్ణయించాల్సి ఉంది. ఇక తొలుత అక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కు కింద అభివృద్ధి చేస్తారు. సాధారణంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో వివిధ రకాల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేటాయిస్తారు. కణమాం పార్కులో ఆటోనగర్‌గా మార్పు చేసేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో ఆటోమొబైల్‌ పరిశ్రమలను మంజూరు చేయనున్నారు. ఇందులో ఆటోమొబైల్‌ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కూడా అనుమతించనున్నారు.

స్క్రాప్‌ దుకాణాల తరలింపు

ఇప్పటికే స్మార్ట్‌ సిటీగా విరాజిల్లుతున్న విశాఖ నగరాన్ని స్క్రాప్‌ ఫ్రీ సిటీగా మార్చాలన్న నిర్ణయానికొచ్చారు. ఇందులోభాగంగా నగర పరిధిలో ఉన్న పలు స్క్రాప్‌ (ఇనుప తుక్కు) దుకాణాలను కూడా అక్కడకు తరలించనున్నారు. నగర పరిధిలోని తగరపువలస నుంచి గాజువాక వరకు జాతీయ రహదారికి ఆనుకుని అనేక స్క్రాప్‌ దుకాణాలున్నాయి. వీటితోపాటు పెందుర్తి, ఎండాడ, ఇసుకతోట, టౌన్‌కొత్తరోడ్డు, కోటవీధి, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లోనూ వెరసి 1300 వరకు ఇవి నడుస్తున్నాయి. ప్రతిపాదిత కణమాం ఆటోనగర్‌ ఆనందపురానికి 12 కి.మీల దూరంలో ఉంది. అందువల్ల ఇటు విశాఖపట్నం, అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి స్క్రాప్‌ తరలించేందుకు అనువుగా ఉండనుంది.

రాజన్న ఆటోనగర్‌గా నామకరణం

ఇలా ఈ పార్కులో ఆటోమొబైల్‌, సర్వీస్‌ సెక్టార్ల యూనిట్ల ఏర్పాటు, స్క్రాప్‌ దుకాణాల తరలింపు వంటి వాటిపై ఫోకస్‌ పెట్టనున్నారు. దీనికి రాజన్న ఆటోనగర్‌గా నామకరణం చేయనున్నారు. మరోవైపు కణమాం ఎంఎస్‌ఎంఈ పార్కుకు కేటాయించిన భూమిలో ఉన్న సాగుదార్లకు పరిహారాన్ని కూడా బ్యాంకులో డిపాజిట్‌ చేశామని ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ త్రినాథ్‌ ‘సాక్షి’కి చెప్పారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం పెదగంట్యాడ, గుర్రంపాలెం, అగనంపూడి, గంభీరంలలో ఇండస్ట్రియల్‌ పార్కులు, గుర్రంపాలెంలో ఎంఎస్‌ఎంఈ పార్కు, చినగదిలిలో హెల్త్‌సిటీ పార్కులతో పాటు గాజువాకలో ఆటోనగర్‌ ఉంది. కొత్తగా ఆటోనగర్‌గా ఏర్పాటు కానున్న కణమాం ఎంఎస్‌ఎంఈ పార్కు తొమ్మిదవది అవుతుంది.

Advertisement
Advertisement