బీఆర్‌టీఎస్‌ బాధితులకు అండగా ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

బీఆర్‌టీఎస్‌ బాధితులకు అండగా ప్రభుత్వం

Published Tue, Nov 21 2023 1:10 AM

- - Sakshi

● నిర్వాసితులకు పూర్తిగా నష్టపరిహారం ● ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ● అండగా ఉంటామన్న కలెక్టర్‌ మల్లికార్జున, ఎమ్మెల్యే ముత్తంశెట్టి

మహారాణిపేట: సింహాచలం బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్‌ మల్లికార్జున అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయంలో జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో నష్టపోయిన కుటుంబాలకు పూర్తి పరిహారం చెల్లించడంతో పాటు టీడీఆర్‌ ఇస్తామన్నారు. అడవివరం సచివాలయంలో మంగళవారం నుంచి నవంబరు 30వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితుల కోసం గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 276 మంది బాధితులను గుర్తించామని, వారిలో 125 మందికి ఇప్పటికే నష్టపరిహారం చెల్లించామన్నారు. మిగిలిన వారికి వచ్చే నెల ఒకటో తేదీ నాటికి చెల్లిస్తామని కలెక్టర్‌ మల్లికార్జున చెప్పారు. అదే విధంగా బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణలో 346 ఆస్తులు గుర్తించామని, వాటిలో 55 టీడీఆర్‌ చెల్లించామన్నారు. మరో 291 ఆస్తులను ఆమోదించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయాలను మినహాయించి విస్తరణలో సగం ఇళ్ల్లు కోల్పోయిన కుటుంబాలు ఇళ్ల మరమ్మతులకు అనుమతిస్తామన్నారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి జగనన్న ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. బాధితులందరికీ న్యాయం జరుగుతుందని, దీనిపై ఎలాంటి అనుమానాలు వద్దని సూచించారు. కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటివి నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణ బాధితులు పాల్గొన్నారు.

బీఆర్‌టీఎస్‌ బాధితుల కోసం హెల్ప్‌డెస్క్‌

డాబాగార్డెన్స్‌: నిర్వాసితుల సౌకర్యార్థం అభ్యర్థనలు స్వీకరించేందుకు నష్ట పరిహార కేంద్రం (హెల్ప్‌ డెస్క్‌) ఏర్పాటు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ పేర్కొన్నారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డులోగల ఇందిరా ప్రియదర్శిని కల్యాణ మండపంలో నష్టపరిహార కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. హెల్ప్‌ డెస్క్‌లో జోన్‌–8 ఏసీపీ/టీపీవో ఈ నెల 27వ తేదీ వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. బాధితులు తమ అభ్యర్థనలు, అభ్యంతరాలు, సలహాలు సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.

Advertisement
Advertisement