ఇంటింటికీ ఆరోగ్యశ్రీ | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ ఆరోగ్యశ్రీ

Published Thu, Nov 30 2023 1:10 AM

- - Sakshi

● ప్రతి ఇంటా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలపై ప్రచారం ● పథకం సమగ్ర వివరాలతో బుక్‌లెట్ల పంపిణీ ● డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు నిర్వహణ ● కార్యాచరణ సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం

మహారాణిపేట: పేదలకు వరంగా మారిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లు చేసింది. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఆరోగ్య శ్రీ సమాచారాన్ని తెలియజేస్తారు. రూ.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో 95 శాతం జనాభాను పథకం పరిధిలోకి తీసుకొచ్చేమనే విషయాన్ని వివరిస్తారు. ఈ పథకానికి సంబంధించిన బ్రోచర్‌, కరపత్రాలను ఇంటింటికీ అందజేస్తారు.

జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. వీటిలో మూడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు(సీహెచ్‌సీ), ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), 63 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(యూపీహెచ్‌సీ), ఒక రూరల్‌ హెల్త్‌ సెంటర్‌, 102 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. మొత్తం 607 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా.. వీటిలో 34 గ్రామీణ ప్రాంతాల్లో, 573 జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి. డిసెంబర్‌ ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో ఆయా సచివాలయాల పరిధిలోని 909 మంది ఆశ కార్యకర్తలు, 542 మంది ఏఎన్‌ఎంలు భాగస్వాములవుతారు. వీరికి వలంటీర్లు సహకారం అందిస్తారు. అనారోగ్యం బారినపడినా, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఎలా చికిత్స పొందాలన్న దానిపై వీరు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య శ్రీ యాప్‌, సిటిజన్‌ యాప్‌(ఆస్పత్రుల వివరాలు) వివరాలు తెలియజేస్తారు. ప్రభుత్వం అందజేసే బుక్‌లెట్‌లో ఆరోగ్యశ్రీ పథకం సేవలను ఎలా పొందాలి? ఏ సేవలు ఉంటాయి? లాంటి అంశాలపై పూర్తి వివరాలు ఉంటాయి.

ఆరోగ్యశ్రీలో 3,257 చికిత్సలు

గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీ ర్యం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్‌ను పథకంలోకి తెచ్చి.. ఏకంగా 3,257కు పెంచారు. క్యాన్సర్‌ వంటి వ్యాధులను ఇందులో చేర్చారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్యను గణనీయంగా పెంచి హైదరాబాద్‌, బెంగళూరు లాంటి నగరాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందిస్తున్నారు. తండ్రి కంటే తనయుడు మిన్న అన్న రీతిలో ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ.. రోగుల కోసం ఆసరా పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఆసరా కింద చికిత్స అనంతరం రోగికి రోజుకు రూ.225 నుంచి నెలకు గరిష్టంగా రూ.5వేల వరకు చెల్లిస్తున్నారు. రోగి లేదా వారి బంధువుల బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తున్నారు.

అందరికీ వైద్య సేవలే లక్ష్యం

రోగ్య శ్రీ పథకానికి సంబంధించి మరింత అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, వలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తారు. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో ఇంటి వద్ద 15 నిమిషాల వరకు కేటాయించి.. ఈ పథకం గురించి వివరించాలి. ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్‌, కరపత్రం అందజేయాలి. ఆరోగ్య శ్రీ సేవలు అందరికీ అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.

– డాక్టర్‌ కె.రాజేష్‌కుమార్‌, జిల్లా సమన్వయకర్త, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ

పారదర్శకంగా సేవలు

జిల్లాలో మొత్తం 50 నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, 20 డెంటల్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెంచారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన తర్వాత రోగి నుంచి తప్పనిసరిగా అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స ఎలా ఉంది? వైద్యులు మంచి సేవలందించారా? మందులు, ఆహారం ఎలా ఉంది? ఇలాంటి వివరాలతో ఉన్న లెటర్‌పై రోగి అంతా బాగుందని సంతకం పెట్టిన తర్వాతే బిల్లులు అందజేస్తున్నారు. వారం రోజుల తర్వాత సమీపంలోని ఆరోగ్యమిత్ర, ఏఎన్‌ఎం మళ్లీ రోగి ఇంటికి వెళ్లి అతని ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

1/1

Advertisement
Advertisement