6న జీవీఎంసీ కౌన్సిల్‌ | Sakshi
Sakshi News home page

6న జీవీఎంసీ కౌన్సిల్‌

Published Thu, Nov 30 2023 1:10 AM

జీవీఎంసీ నమూనా - Sakshi

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ సర్వసభ్య సమావేశం(కౌన్సిల్‌) డిసెంబర్‌ 6న నిర్వహించనున్నారు. మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్న కౌన్సిల్‌ సమావేశంలో రూపొందించిన 18 అజెండా అంశాలతో పాటు మరికొన్ని టేబుల్‌ అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా..

4.37 ఎకరాల్లో జీవీఎంసీ హెడ్‌ క్వార్టర్‌ బిల్డింగ్‌
మహా విశాఖ నగర సమగ్ర అభివృద్ధి, నగర జనాభా పెరుగుదల, వచ్చే 40, 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముడస ర్లోవలోని 4.37 ఎకరాల కార్పొరేషన్‌ స్థలంలో నూతన ప్రధాన కార్యాలయం నిర్మించాలని జీవీఎంసీ భావించింది. ఇందుకు గత కౌన్సిల్‌ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. గ్రౌండ్‌ 4 అంతస్తుల్లో(సుమారుగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం) నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు. ఇప్పటికే కాన్సెప్టువల్‌ ప్లాన్‌, డిజైన్స్‌ రూపొందించారు. ఎస్‌ఎంజీ డిజైన్‌(హైదరాబాద్‌) కంపెనీ ప్రతిపాదించిన ప్లాన్‌ను అనుసరించి రూ.99.47 కోట్లు అంచనా వ్యయంతో జీవీఎంసీ నూతన ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదించేందుకు కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు ఆమోదం తెలపనున్నారు.

కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన జోనల్‌ హార్టికల్చర్లు
జీవీఎంసీ పరిధిలో 110.51 కిలోమీటర్ల సెంట్రల్‌ మీడియన్స్‌ల పర్యవేక్షణ, 34 కిలోమీటర్ల గ్రీన్‌బెల్ట్‌ల పర్యవేక్షణ, 172 పార్కుల పర్యవేక్షణ, అభివృద్ధి దశలో ఉన్న 7 థీమ్‌ పార్క్‌ల పర్యవేక్షణ, 143 రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న కాలనీ పార్కుల పర్యవేక్షణ, 57 ట్రాఫిక్‌ ఐల్యాండ్స్‌ పర్యవేక్షణ, జీవీఎంసీ పరిధిలో అందుబాటులో ఉన్న 770 పబ్లిక్‌ ఖాళీ స్థలాలను పార్కులుగా, గ్రీన్‌బెల్ట్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రీనరీ అభివృద్ధి, నిర్వహణకు అందుబాటులో ఉన్న సిబ్బందితో ప్రజలు, పర్యాటకుల సంతృప్తి మేరకు గ్రీనరీ అభివృద్ధికి సాధ్యం కాకపోవడంతో జోన్‌కి ఒక జోనల్‌ హార్టికల్చర్‌ అధికారిని నియమించనున్నారు. మొత్తం ఎనిమిది మందిని మూడేళ్ల కాంట్రాక్ట్‌ పద్ధతిలో నెలకు రూ.25వేలు వేతనంతో తీసుకోనున్నారు.

ఎకోఫ్రెండ్లీ సాగర్‌నగర్‌ తాబేలు బీచ్‌
సాగర్‌నగర్‌కు ఎదురుగా బీచ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న బీచ్‌ స్థలంలో రూ.15.65 కోట్లతో ‘ఎకోఫ్రెండ్లీ సాగర్‌నగర్‌ తాబేలు బీచ్‌’ అభివృద్ధికి జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ సలహాలతో పర్యావరణ అనుకూలమైన సాగర్‌నగర్‌ తాబేలు బీచ్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. పర్యావరణ అనుకూలమైన బీచ్‌ టూరిజంను ప్రోత్సహించడానికి, సముద్ర పర్యావరణ జీవితం, ఆలీవ్‌రిడ్లే తాబేళ్ల గురించి పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు ఈ బీచ్‌ ఏర్పాటు చేయనున్నారు. అందుకు ప్రభుత్వ ఏజెన్సీ ఏపీయూఐఏఎమ్‌ఎల్‌ ప్రాథమిక డిజైన్లు, డ్రాయింగ్‌ సిద్ధం చేశారు. వీటితో మరికొన్ని అజెండా అంశాలతో పాటు మరికొన్ని టేబుల్‌ అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి.

 రేపు స్థాయీ సంఘ సమావేశం
​​​​​​​
జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం డిసెంబర్‌ 1వ తేదీన స్థాయీ సంఘ చైర్‌పర్సన్‌, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన నిర్వహించనున్నారు. సభ్యుల ముందుకు 25 అంశాలు చర్చకు రానున్నాయి.

Advertisement
Advertisement