రేపటి నుంచి ‘మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌’ | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ‘మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌’

Published Thu, Nov 30 2023 1:10 AM

సమావేశంలో మాట్లాడుతున్న హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రెటరీ బి.ఎం.దివాన్‌ 
 - Sakshi

● 60 రోజులు నిర్వహించేందుకు ఏర్పాట్లు ● జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి ● హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రెటరీ బి.ఎం.దివాన్‌

దొండపర్తి: జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేసేందుకు డిసెంబర్‌ 1 నుంచి జనవరి 30వ తేదీ వరకు 60 రోజుల పాటు ప్రత్యేకంగా ‘మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌’ చేపట్టాలని హౌసింగ్‌ స్పెషల్‌ సెక్రెటరీ బి.ఎం.దివాన్‌ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతి తీరుపై హౌసింగ్‌, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఈపీడీసీఎల్‌, నిర్మాణ ఏజెన్సీలు, ఇతర సంబంధిత శాఖల అధికారులతో బుధవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణలను వేగవంతం చేయాలని చెప్పారు. ఇందుకోసం జరుగుతున్న డ్రైవ్‌లో ఇప్పటికే ప్రారంభించిన ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు పిలుపునిచ్చారు. పని ప్రారంభించిన ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతాలు తెరవాలని సూచించారు. గృహ నిర్మాణ లక్ష్యాలను మండల, గ్రామ, సచివాలయాలు వారీగా నిర్దేశించారని, గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డ్‌ అమినిటీ సెక్రటరీలు రానున్న రెండు నెలలు జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్‌, ఐరన్‌కి ఎటువంటి కొరత లేదని తెలిపారు.

నిర్మాణ ఏజెన్సీలు లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్‌

కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలో రెండో దశలో 16, 676 ఇళ్లు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నిర్మాణ ఏజెన్సీలు తమకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అవసరమైన లేబర్‌, సెంట్రింగ్‌ సామగ్రి, ఇటుకలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. లేకుంటే ఏజెన్సీ కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి జగనన్న లేఅవుట్‌ కాలనీలో ఆర్చ్‌ను త్వరతగతిని నిర్మించాలన్నారు. లేఅవుట్లలో ప్రత్యేక శ్రద్ధ వహించి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి మొదటి వారంలో రెండో దశ సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో హౌసింగ్‌ పీడీ అఖిల, ఆర్డీఓలు హుస్సేన్‌ సాహెబ్‌, భాస్కర్‌ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement