విద్యుత్‌ పొదుపు చేస్తే ఉత్పత్తి చేసినట్లే.. | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పొదుపు చేస్తే ఉత్పత్తి చేసినట్లే..

Published Fri, Dec 15 2023 1:04 AM

- - Sakshi

ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌

సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి పిలుపునిచ్చారు. ఒక యూనిట్‌ విద్యుత్‌ ఆదా చేస్తే.. రెండు యూనిట్లను ఉత్పత్తి చేసిన వారమవుతామన్నారు. జాతీయ విద్యుత్‌ పొదుపు వారోత్సవాలు పురస్కరించుకుని విద్యుత్‌ పొదుపునకు సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలు, వాల్‌ పోస్టర్లను సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో గురువారం ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ పొదుపును తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో ఈ నెల 20 వరకు విద్యుత్‌ పొదుపు వారోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టార్‌ రేటెడ్‌ గృహోపకరణాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు, విద్యుత్‌ పొదుపుపై అవగాహన ర్యాలీలు, కళా ప్రదర్శనలు, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు, కళాశాల విద్యార్థులకు సదస్సులు నిర్వహించాలని సర్కిల్‌ ఎస్‌ఈలకు ఆదేశాలిచ్చినట్లు వివరించారు. డైరెక్టర్లు బి.రమేష్‌ ప్రసాద్‌, డి.చంద్రం, ఏవీవీ సూర్య ప్రతాప్‌, సీజీఎంలు సింహాద్రి, ఎస్‌.మసిలామణి, అచ్చి రవికుమార్‌, డి.సుమన్‌ కల్యణి, ఎస్‌ఈ ఎల్‌.మహేంద్రనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement