‘బండారు’ చెంత అసంతృప్తుల చింత..! | Sakshi
Sakshi News home page

‘బండారు’ చెంత అసంతృప్తుల చింత..!

Published Sat, Mar 16 2024 12:55 AM

- - Sakshi

టికెట్‌ రాకపోవడంతో ఇంకా మౌనముద్రలోనే సత్యనారాయణమూర్తి

ఉమ్మడి విశాఖలో టికెట్‌ రాని తెలుగు తమ్ముళ్లంతా బండారు ఇంటికి..

భవిష్యత్తు కార్యాచరణపై చర్చించిన నేతలు

చంద్రబాబు వైఖరిపై గుర్రుగా ఉన్న సీనియర్లు

పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంపై రగిలిపోతున్న కేడర్‌

విశాఖ సిటీ: జిల్లా తెలుగుదేశంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అధినేత చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వారిని పక్కన పెట్టి.. ఆర్థిక పరిపుష్టి ఉన్న వారికే టికెట్లు ఇవ్వడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రెండో జాబితా ప్రకటించిన తరువాత జిల్లా టీడీపీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిన్న మొన్నటి వరకు అధినేతపై ఈగ వాలనివ్వని నేతలంతా జాబితాలో చోటు దక్కకపోవడంతో.. చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. అసంతృప్తి నేతలంతా ఒక చోట చేరడం ఇపుడు టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

బండారుకు బుజ్జగింపులు
పెందుర్తి టికెట్‌ను తెలుగుదేశం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్‌బాబు ఎన్నికల బరిలో దిగనున్నారు. దీంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన తనను పక్కనపెట్డడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే బండారుకు, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు గత కొద్ది కాలంగా పొసగడం లేదు. పంచకర్లకు టికెట్‌ ఇస్తే తాను సహకరించనని గతంలోనే టీడీపీ అధినాయకత్వానికి తేల్చి చెప్పారు.

పెందుర్తి టికెట్‌ కోసం బండారు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించినప్పటికీ బండారుకు ప్రత్యామ్నాయం చూపించకపోవడంపై రగిలిపోతున్నారు. గురువారం రెండో జాబితా ప్రకటించినప్పటి నుంచి బండారు పరవాడలో ఉన్న తన ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేదు. జిల్లా నాయకులు ఫోన్‌ చేసినప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో టీడీపీ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు.. బండారు ఇంటికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసి వెళ్లిపోయారు.

బండారు నివాసానికి అసంతృప్తివాదులు
టికెట్‌ ఆశించి భంగపడిన టీడీపీ అసంతృప్తివాదులు బండారు నివాసంలో సమావేశమయ్యారు. అనకాపల్లి ఇంచార్జ్‌ పీలా గోవింద్‌, చోడవరం ఇంచార్జ్‌ తాతాయ్యబాబు, మాడుగుల టీడీపీ నేత పీవీజీ కుమార్‌, ఇతర నాయకులు బండారు నివాసానికి వెళ్లి తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన తమను అధినాయకత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంతమంది పార్టీ సీనియర్లతో పాటు చంద్రబాబు కూడా ఫోన్లు చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

జనసేన పార్టీ నేతలతో కలిసి పనిచేయాలని, పార్టీ నిర్ణయించిన, జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. దీనిపై అసంతృప్తి నేతలు మరింత రగిలిపోతున్నారు. పొత్తుల పేరుతో టికెట్లు ఇవ్వకపోగా.. పక్క పార్టీల విజయానికి కష్టపడాలని చెప్పడంపై మండిపడుతున్నారు. వీరిలో కొంత మంది పార్టీ మార్పుపై చర్చించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement
Advertisement