వేర్వేరు సంఘటనల్లో పలువురి మృతి | Sakshi
Sakshi News home page

వేర్వేరు సంఘటనల్లో పలువురి మృతి

Published Wed, May 17 2023 12:30 AM

జామి: అప్పారావు మృతదేహాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌, ఎస్సై - Sakshi

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా సంఘటనలపై మృతుల బంధువులు, పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. – సాక్షి నెట్‌వర్క్‌

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ గ్రామానికి చెందిన పసుపురెడ్డి అభిషేక్‌(19) సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన స్వగ్రామమైన చిన్నబగ్గ నుంచి కొత్తూరు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యంలో బడిగాం సమీపంలో వాహనం అదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108లో ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. అభిషేక్‌ గత సంవత్సరం సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.

హోంగార్డు హఠాన్మరణం

వంగర: మండల పరిధి సంగాం గ్రామానికి చెందిన వెలగాడ ప్రకాశం(52) వంగర పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తుండగా శ్రీహరిపురం గ్రామంలోని ఉపాధిహామీ చెరువు వద్ద బందోబస్తు కోసం వెళ్లాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో సంగాంలోని ఇంటికి చేరుకుని గ్లాసుతో నీళ్లు తాగి సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. మృతుడికి భార్య రోజాతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

పాము కాటుతో బాలుడు..

గుర్ల: మండలంలోని చోడవరంలో పాము కాటుకు గురై గరివిడి మండలం వెదుళ్లవలసకు చెందిన అల్లు చరణ్‌ (11) మృతిచెందాడు. చోడవరంలోని తాతగారింటికి పది రోజుల కిత్రం చరణ్‌ వచ్చాడు. స్నేహితులతో కలిసి ఇంటి దగ్గరలోని కళ్లాల్లో అడుతుండగా దగ్గరలో ఉన్న తాటి చెట్లలో నుంచి పాము వచ్చి కాటు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

చెరువులో పడి వృద్ధుడు..

భోగాపురం: మండల కేంద్రంలోని సింగాల చెరువులో పడి గుర్తు తెలియని వృద్ధుడు(50) మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పంచనామా నిర్వహించారు. ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ..

గంట్యాడ: మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన యర్రాపు వరలక్ష్మి(49) ఈనెల 5వతేదీన పాముకాటుకు గురవడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

పిడుగుపడి వ్యక్తి

జామి: మండలంలోని కె.భీమసింగి గ్రామానికి చెందిన పాండ్రంకి అప్పారావు(40) పిడుగుపడి మృతిచెందాడు. పశువులను పొలంలోకి తీసుకుని వెళ్లగా ఆ సమయంలో వర్షంతో పాటు పిడుగుపడడంతో మృతిచెందాడు. మృతునికి భార్య కొండమ్మ, కుమారుడు నవీన్‌ ఉన్నారు.

పరుగు పందెంలో ఆగిన ఊపిరి

వీరఘట్టం: మండలంలోని ఎం.రాజపురం గ్రామానికి చెందిన డర్రు రాజేష్‌(21) పరుగు పందెంలో ఊపిరి వదిలాడు. సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం మంగళవారం అనకాపల్లిలో నిర్వహించిన పరుగు పందెంలో రాజేష్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడ ఉన్నవారు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

లారీ క్లీనర్‌..

దత్తిరాజేరు; మండలంలోని చౌదంతివలస వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో క్లీనర్‌ మృతి చెందినట్లు ఇన్‌చార్జ్‌ ఎస్సై శిరిష మంగళవారం రాత్రి తెలిపారు. రామభద్రపురం నుంచి పెదమానాపురం వైపు వెళ్తున్న లారీ జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో క్లీనర్‌ మృతి చెందాడని మృతదేహాన్ని గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

గంట్యాడ: వరలక్ష్మి 
మృతదేహం
1/4

గంట్యాడ: వరలక్ష్మి మృతదేహం

సీతంపేట: మృతి 
చెందిన అభిషేక్‌
2/4

సీతంపేట: మృతి చెందిన అభిషేక్‌

వీరఘట్టం: డర్రు రాజేష్‌
3/4

వీరఘట్టం: డర్రు రాజేష్‌

వంగర: మృతిచెందిన ప్రకాశం
4/4

వంగర: మృతిచెందిన ప్రకాశం

Advertisement
Advertisement