రెండు లారీలు ఢీ | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ

Published Thu, Nov 9 2023 2:22 AM

-

వీరఘట్టం: మండలంలోని సీఎస్‌పీ రహదారిలో వీరఘట్టం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఎదురుగా బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు అదుపుతప్పి ఢీ కొన్నాయి. రెండు లారీలు ఢీ కొట్టుకోవడంతో పెద్ద శబ్దం రాగా సమీపంలో ఉన్న వారంతా ఏం జరిగిందోనని భయాందోళన చెందారు. అయితే రెండు లారీల ముందర భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఢీ కొన్న లారీలను రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసి,కేసు నమోదు చేశారు.

15 గ్యాస్‌ సిలిండర్ల సీజ్‌

రాజాం సిటీ: పట్టణంలోని పలు హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 15 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని సీఎస్‌డీటీ చిరంజీవరావు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో రాజాం, వంగర, చీపురుపల్లి, గరివిడి, భోగాపురం మండలాలకు చెందిన సివిల్‌ సప్‌లైస్‌ అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 15 సిలిండర్లను సీజ్‌చేసి స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక లక్ష్మీగ్యాస్‌ ఏజెన్సీకి అప్పగించామని సీఎస్‌డీటీ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గృహావసరాలకు సంబంధించిన గ్యాస్‌ను వాణిజ్య సముదాయాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పట్టణంలో తరచూ దాడులు నిర్వహించనున్నామని, ఈ దాడుల్లో పట్టుబడిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్‌లైస్‌ అధికారులు చిరంజీవరావు, బి.మురళీకృష్ణ, రామకృష్ణ, శోభారాణి, సాయికామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సారాతో పట్టుబడిన

మహిళలకు రిమాండ్‌

కొత్తవలస: మండలంలోని గొల్లపేట గ్రామానికి చెందిన బొబ్బాది వరలక్ష్మి, లక్కవరపుకోట మండలం మార్లాపల్లి గ్రామంలో వడిసిల సింహాచలంను సారా అమ్ముతున్న కేసులో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఈబీ ఎస్సై పి.నరేంద్రకుమార్‌ తెలిపారు. ఆ ఇద్దరు మహిళలు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆ మహిళల ఇళ్లవల్ల తనిఖీ చేసి వరలక్ష్మి ఇంటి వద్ద లీటర్‌ సారాను, సింహాచలం ఇంటి వద్ద లీటర్ల సారాను గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై నరేంద్రకుమార్‌ వివరించారు.

ఈ–క్రాప్‌, ఈకేవైసీ రైతులే అర్హులు

జిల్లా వ్యవసాయ అధికారి

తారకరామారావు

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో వరిపంట 2.31 లక్షల ఎకరాల్లో సాగవగా, 1,73, 613 మంది రైతులు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్నారని జిల్లా వ్యవసాయ అధికారి వి. తారకరామారావు తెలిపారు. వారంతా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకున్నారని, వారి పంట మాత్రమే కొనుగోలుకు అర్హత కలిగి ఉందని చెప్పారు. రైతులు పంట కోతకు ముందు రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు షెడ్యూల్‌ చేయించుకోవాలని, ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండేవిధంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ఉన్న వాహనాల్లో మాత్రమే రవాణా చేయాలన్నారు. గోనె సంచులు, హమాలీలు రైతు ఏర్పాటు చేసుకుంటే వాటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎఫ్‌టీఓ చేతికందిన తర్వాత రైతు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌ చేయడానికి ఎవరైనా డబ్బులు అడిగితే ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 1967కు ఫోన్‌చేసి వివరాలు తెలపాలని చెప్పారు. ధాన్యం అమ్మే విషయంలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 8331056278 తెలియజేయాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో ఆక్టోబర్‌ నెలలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల మూలంగా 5,601 ఎకరాల విస్తీర్ణంలో వరిపంట, 71 ఎకరాల్లో పత్తి, 90 ఎకరాల విస్తీర్ణంలో చోడిపంట పూర్తిస్థాయిలో ఎండిపోయిందన్నారు. అలాగే మరో 24,332 ఎకరాల్లో వరి పంటకు నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు. పంటల పరిశీలన నిమిత్తం కేంద్ర బృందం త్వరలో రానున్నదన్నారు. దెబ్బతిన్న పంటలకు నిబంధనలను అనుసరించి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా వర్తిస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.

Advertisement
Advertisement