డిసెంబర్‌ 15 నుంచి ఆడుదాం ఆంధ్రా | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 15 నుంచి ఆడుదాం ఆంధ్రా

Published Sat, Nov 11 2023 12:36 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ ఆర్‌.గోవిందరావు - Sakshi

పార్వతీపురం: ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను డిసెంబర్‌ 15 నుంచి వచ్చే జనవరి 26వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న అన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలపై శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, కోకో, కబడ్డీ, వాలీబాల్‌ క్రీడాంశంలలో 15ఏళ్ల వయస్సు పైబడిన మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో డిసెంబర్‌ 15 నుంచి 20 వరకు, మండలస్థాయిలో డిసెంబర్‌ 21 నుంచి వచ్చే జనవరి 4వరకు జిల్లాస్థాయిలో జనవరి 11 నుంచి 21వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు జనవరి 22 నుంచి 26 వరకు విశాఖపట్నంలో జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో గ్రామ, వార్డు సచివాలయ స్థాయిల్లో పంచాయతీ, వార్డు కార్యదర్శులు, వలంటీర్లు, మండలస్థాయిలో ఎంపీడీఓ కీలక బాధ్యత నిర్వహించాలని సూచించారు. క్రీడా పోటీలకు రాష్ట్రంలో 75లక్షల మంది పాల్గొనే విధంగా రాష్ట్ర, జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ పోటీల్లో మండల స్థాయి నుంచి పాల్గొనే ప్రతీ క్రీడాకారుడికి టీషర్టు, క్యాప్‌, రిస్ట్‌బ్యాండ్‌ను ప్రభుత్వం బహూకరిస్తుందని, నియోజకవర్గ, జిల్లాస్థాయి క్రీడాకారులకు భోజన, రవాణా, వసతి సౌకర్యాలు కల్పించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోటీలకు ప్రత్యేక ఆహ్వానితులు ఆకర్షణగా నిలుచుటకు జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారిని గుర్తించి స్పోర్ట్స్‌ అంబాసిడర్లగా నియమించినట్లు చెప్పారు. క్రీడా పోటీలకు నోడల్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌గా ఉంటారన్నారు. అనంతరం పార్వతీపురం నుంచి వీసీలో పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవిందరావు మాట్లాడుతూ ఆడుదాం ఆంఽద్రా క్రీడా పోటీల నిర్వహణకు జిల్లాలో 312 గ్రామ, 38 వార్డు సచివాలయాలు, 15 మండల కేంద్రాలు, నాలుగు శాసన సభ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేశామన్నా రు. కార్యనిర్వాహక, సాంకేతిక కమిటీలను నియమించామని నిర్వహణ విధులు బాధ్యతలను వివరించామని జవాబిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా క్రీడాధికారి ఎస్‌. వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.రమాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

నవంబర్‌ 20 నుంచి నమోదు

ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జేసీ తెలిపారు. ఈ ప్రక్రియ నవంబర్‌ 20 నుంచి ప్రారంభమవుతుందన్నారు. క్రీడల నిర్వహణకు క్రీడా పరికరాలు ఆయా గ్రామ వార్డు సచివాలయం, మండల స్థాయిలకు నవంబర్‌ 21 నాటికి చేరుతాయని చెప్పారు.

యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌

Advertisement
Advertisement