నాణ్యమైన విద్యే లక్ష్యం | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యే లక్ష్యం

Published Sun, Nov 12 2023 12:28 AM

తోటపాలేంలో చిన్నారులతో ప్రీస్కూల్‌ యాక్టివిటీ చేయిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త - Sakshi

● అంగన్‌వాడీల్లో ఉత్తమ బోధనకు ప్రభుత్వం చర్యలు ● ప్రీ స్కూల్‌ యాక్టివిటీపై ఐసీడీఎస్‌ పీవోలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ● జిల్లాతో పాటు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల వారికి కూడా.. ● బ్యాచ్‌కు 250 మందికి చొప్పున శిక్షణ ● శిక్షణార్థులతో అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ● జిల్లాలో 2,499 అంగన్‌వాడీ కేంద్రాలు

విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రాలకు వచ్చే పిల్లలంతా పేద, మధ్య తరగతి వర్గాల వారే కావడంతో వారిని ఎలాగైనా ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు జగనన్న సర్కారు మంచి ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఏ ఒక్కరూ తమ పిల్లలను కాన్వెంట్లకు పంపించలేకపోయామేననే భావనను తల్లిదండ్రుల్లో లేకుండా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పర్యవేక్షించే ఐసీడీఎస్‌ పీవోలు, సూపర్‌వైజర్లకు పిల్లలకు ఇచ్చే విద్యాబోధనలో నాణ్యత, మెలకువలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా ప్రీస్కూల్‌ యాక్టివిటీ(పూర్వ ప్రాథమిక విద్య)పై బోధనపై ఈ శిక్షణ ఉంటోంది. ఇప్పటికే కొంతమందికి శిక్షణ పూర్తికాగా, మరి కొంతమందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు.

6 రోజుల పాటు శిక్షణ..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న ఐసీడీఎస్‌ పీవోలు, సూపర్‌వైజర్లకు విజయనగరం జిల్లాలోని మరుపల్లి వద్ద శిక్షణ ఇస్తున్నారు. బ్యాచ్‌కు 250 మంది చొప్పున ఒక్కో బ్యాచ్‌కు 6 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి కాగా ప్రస్తుతం మూడో బ్యాచ్‌కు ఇచ్చే శిక్షణ కొనసాగుతోంది.

కాన్వెంట్‌ల కన్నా దీటుగా బోధన..

కాన్వెంట్‌లలో కన్నా దీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధన ఉండేలా ప్రీస్కూల్‌ యాక్టివిటీ(పూర్వప్రాథమిక విద్య)పై శిక్షణ ఇస్తున్నారు. మరింత మంది పిల్లలు కేంద్రాలకు వచ్చేలా శిక్షణ విధానం ఉండగా, ప్రీస్కూల్‌ కిట్లను కూడా ప్రభుత్వం అందించనుంది. ఆటపాటలతో కూడిన విద్యనందించేందుకు అవసరమైన ఆట వస్తువులు, ఇతర సామగ్రి పంపిణీ చేయడం జరుగుతుంది. చెక్కలతో చేసిన ఏబీసీడీలు, కలర్స్‌ గుర్తించే బొమ్మలు, బిల్డింగ్‌ను కట్టే మెటీరియల్‌ తదితర వస్తువులు సామగ్రిలో ఉంటాయి. వీటితో పిల్లలకు సులువుగా బోధించవచ్చని ట్రైనీలు, ట్రైనర్లు చెబుతున్నారు.

జిల్లాలో 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు..

జిల్లాలో మొత్తం 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా, వీటిలో బొబ్బిలి, బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, ఎస్‌.కోట, వియ్యంపేట, విజయనగరం అర్బన్‌, రాజాం ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటి పర్యవేక్షణకు 11 మంది పీవోలు, 79 మంది సూపర్‌వైజర్లు ఉన్నాయి. వీరి పరిధిలో 8,558 మంది గర్భిణులు, 9,692 మంది బాలింతలు, 6 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు 10,351 మంది ఉన్నారు. వీరితో పాటు 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 34,730 మంది, 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు 21,073 మంది ఉన్నారు.

శిక్షణతో ఉత్తమ ఫలితాలు..

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఉత్తమ బోధన అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఐసీడీఎస్‌ పీవోలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన వారు తమ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. దీంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని ఆశిస్తున్నాం.

–బి.శాంతకుమారి,

జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement