విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు

Published Thu, Nov 16 2023 1:28 AM

పంపిణీ చేయనున్న ఉపకరణాలు 
 - Sakshi

18న జిల్లా కేంద్రంలో అర్హులైన

లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ

శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: జేసీ

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని విభిన్న పత్రిభావంతులకు సహాయ ఉపకరణాలను మరోసారి ఉచితంగా పంపిణీ చేసేందుకు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ రంగం సిద్ధం చేసింది. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అభ్యర్థన మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలిమ్‌ కో (హైదరాబాద్‌) సంస్థ ద్వారా సుమారు రూ.3 కోట్ల విలువ చేసే ఉపకరణాలను దాదాపు మూడువేల మందికి ఉచితంగా సరఫరా చేసిన విషయం తెలిందే. నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన శిబిరాల్లో గుర్తించిన లబ్ధిదారులకు పంపిణీ చేసింది. అయితే, ఉపకరణాలు కావాలని ఉన్నతాధికారులకు వినతులు అందడంతో మరోసారి పంపిణీ చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి నిర్ణయించారు. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ జిల్లా శాఖ అభ్యర్థన మేరకు విశాఖకు చెందిన ఐఓసీఎల్‌ సంస్థ సేవా నిధులు ఇచ్చేందుకు ముందుకువచ్చింది.

18న అర్హుల గుర్తింపు ప్రక్రియ

జిల్లాలో మరోసారి ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అర్హుల గుర్తింపు శిబిరాన్ని ఈ నెల 18న విజయనగరం యూత్‌ హాస్టల్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం జరుగుతుంది.

శిబిరాలకు తీసుకురావాల్సిన పత్రాలు:

● మెడికల్‌ బోర్డు ద్వారా జారీ చేసిన సదరం వైద్య ధ్రువీకరణ పత్రం (40 శాతం, అంతకన్నా ఎక్కువ)

● ఆదాయ ధ్రువీకరణ పత్రం (నెలకు రూ.22,500లు మించకుండా)

● రేషన్‌ కార్డు లేదా ఓటరు కార్డు (చిరునామా కోసం), ఆధార్‌ కార్డు

● రెండు పాస్‌ఫొటో సైజ్‌ ఫొటోలు (అంగవైకల్యం కనిపించేలా)

● యూడీఐడీ కార్డు ఉండాలి

పంపిణీ చేసే ఉపకరణాలు

మూడు చక్రాల సైకిళ్లు, వీల్‌ చైర్లు, చంక కర్రలు, కృత్రిమ కాళ్లు, కాలిపర్స్‌, రోలేటర్స్‌, చెవి మిషన్‌లు (బీటీఈ), వాకింగ్‌ స్టిక్స్‌, మానసిక ప్రతిభావంత పిల్లలకు ఎంఎస్‌ఐఈడీ కిట్స్‌, లెప్రసీ సోకిన వారికి ఏడీఎల్‌ కిట్‌, సీపీచైర్‌, బ్యాటరీ ఆపరేటెడ్‌ మూడు చక్రాల సైకిళ్లు ఉన్నాయి. బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిళ్లు పొందేందుకు 80 శాతం శారీరక వికలాంగత్వం ఉన్నవారు అర్హులు. చేతులు బాగుండి, కాళ్లు వికలాంగత్వం కలిగి ఉన్న దివ్యాంగులకు మాత్రమే ట్రైసైకిళ్లు అందజేస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఉచితంగా అందజేసే ఉపకరాణాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా ఈ నెల 18న నిర్వహించే శిబిరాలకు హాజరై పేరు నమోదుచేయించుకోవాలి. గత మూడేళ్లలో ఉపకరణాలు తీసుకున్న వారు అనర్హులు.

– కె.మయూర్‌ అశోక్‌, జేసీ

1/1

Advertisement
Advertisement