పీహెచ్‌సీలకు ఆధునిక సొబగులు | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలకు ఆధునిక సొబగులు

Published Sun, Nov 19 2023 12:44 AM

నిర్మాణం పూర్తయిన చల్లపేట పీహెచ్‌సీని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఓ భాస్కరరావు  
 - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కోసం గుడికి... ఒంట్లో నలతగా ఉంటే ఆస్పత్రులకు వెళ్తాం. మానవ జీవనంలో రెండూ ప్రధానమే. ఆలయంలోని దేవుడు నమ్మకంతో కూడిన ధైర్యాన్నిస్తే... ఆస్పత్రిలోని వైద్యుడు ఆయుష్షును పోస్తాడు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఆస్పత్రులను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ పీహెచ్‌సీలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. పూర్తిస్థాయి సిబ్బంది నియామకంతో పాటు ఆధునిక వైద్యపరికరాలు, వైద్యసేవలందించేందుకు అవసరమైన భవనాలను నిర్మిస్తోంది. ఆస్పత్రి పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతోంది. గతంలో పేరు కూడా కనిపించని స్థాయిలో ఉండే పీహెచ్‌సీలకు ఆధునిక సొబగులు అద్దుతోంది.

ఆధునికీకరణ పనులు ఇలా...

జిల్లాలో 48 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 42 పీహెచ్‌సీలు ఆధునీకరణకు, ఆరు పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణానికి నాడు–నేడు కింద ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. ఇప్పటికే 42 పీహెచ్‌సీల ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. దీనికోసం రూ. 16.04 కోట్లు ఖర్చుచేసింది. పీహెచ్‌సీల్లో మరుగుదొడ్ల మరమ్మత్తులు, ఆపరేషన్‌ థియేటర్‌ ఆధునికీకరణ, ఏసీ సౌకర్యం, ఆస్పత్రి అంతా పెయింటింగ్స్‌, పాడైన వాటి డోర్లు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, పాడైన టైల్స్‌ స్థానంలో కొత్త టైల్స్‌ వేయించడం వంటి పనులను నాడు–నేడు కింద చేపట్టింది.

రూ.10.37 కోట్లతో ఆరు పీహెచ్‌సీ భవనాల నిర్మాణం

జిల్లాలోని ఆరు పీహెచ్‌సీల భవనాలు పూర్తిగా పాడవ్వడంతో కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.37 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.1.73 కోట్ల ఖర్చుతో చల్లపేట పీహెచ్‌సీ భవన నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఐదు పీహెచ్‌సీల భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. జామి పీహెచ్‌సీ భవనాలు రూ.1.84 కోట్లు, అలమండలో రూ.1.66 కోట్లు, కొత్తవలసలో రూ.1.79 కోట్లు, వియ్యంపేటలో రూ.1.69 కోట్లు, ఎల్‌.కోట పీహెచ్‌సీ భవనాలు రూ.1.65 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయి. పీహెచ్‌సీల్లో ప్రసవ సేవలకు ఆపరేషన్‌ థియేటర్‌, మాతాశిశు సంరక్షణకు ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేస్తున్నారు.

నాడు–నేడు నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి

42 పీహెచ్‌సీల ఆధునికీకరణ కోసం రూ.16.04 కోట్ల ఖర్చు

ఆరు పీహెచ్‌సీలకు కొత్త భవనాలు

మంజూరు

వీటి నిర్మాణానికి రూ.10.37 కోట్లు

మంజూరు చేసిన ప్రభుత్వం

వీటిలో చల్లపేట పీహెచ్‌సీ భవన

నిర్మాణం పూర్తి

ప్రజారోగ్యానికి పెద్దపీట

ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. నాడు–నేడు నిధులతో జిల్లాలోని 42 పీహెచ్‌సీల్లో ఆధునికీకరణ పనులు చేపట్టాం. వీటిలో ఒక పీహెచ్‌సీలో పనులు పూర్తయ్యాయి. ఆధునికీకరణ పనులు అత్యంత నాణ్యతతో చేపడుతున్నాం.

– డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, డీఎంహెచ్‌ఓ

ఆధునీకరించిన గంట్యాడ మండలం 
పెదమజ్జి పాలెం పీహెచ్‌సీ
1/2

ఆధునీకరించిన గంట్యాడ మండలం పెదమజ్జి పాలెం పీహెచ్‌సీ

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement