తవ్వేస్తున్నారు..! | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2023 2:20 AM

వీపనగండ్ల మండలం తూంకుంట వాగులో ఇసుక తరలింపునకు బారులు తీరిన ట్రాక్టర్లు (ఫైల్‌)  - Sakshi

వనపర్తి క్రైం: జిల్లాలో ఇసుక మాఫియా విజృంభిస్తోంది. వాగులు, వంకలతో పాటు పంట పొలాలు, బీడు భూములు, చెరువులను సైతం వదలడం లేదు. ఎక్కడపడితే అక్కడ మట్టిని తోడి ఇసుకగా మార్చేస్తున్నారు. అనుమతుల మాటున అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నది చాలదన్నట్లుగా మట్టిని కూడా ఫిల్టర్‌ చేసి వచ్చిన ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే అనుమతులు ఉన్న రీచ్‌ల నుంచి రెండు, మూడు ట్రిప్పులకు అనుమతులు తీసుకొని ఉదయం నుంచి రాత్రి దాకా అక్రమంగా తరలిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఇసుకాసురుల వ్యాపారం మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది.

కృష్ణానది తీర ప్రాంతాల నుంచి..

ప్రకృతి సంపద అయిన ఇసుకను కృష్ణానది తీరం నుంచి పగటిపూట ట్రాక్టర్లతో రహస్య ప్రాంతాలకు తరలించి భారీగా నిల్వలు చేసి రాత్రిళ్లు పొక్లెయిన్ల సాయంతో టిప్పర్లలో లోడ్‌ చేసి పట్టణాలకు తరలిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి అక్రమార్కులకు తెరచాటున సహకరిస్తున్నారన్న ఆరోపణలుండగా.. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోంది. రాత్రి, పగలు తేడాలేకుండా సాగుతున్న ఈ దందాతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అడ్డుకట్టపడేనా..

ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్పీ కె.రక్షితమూర్తి ఇసుక అక్రమ రవాణా, దందాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంతవరకు అధికారుల కనుసన్నల్లో జోరుగా సాగిన దందాను ప్రస్తుతం ఇసుకాసురులు కొత్త పంథాలో రాత్రిళ్లు రహస్యంగా సాగిస్తున్నారు. ప్రత్యేక నిఘా ఉంచి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

జిల్లాలోనిఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా..

వీపనగండ్ల మండలం తూంకుంట వాగులో పొక్లెయిన్ల సాయంతో ఇసుకను తవ్వి రహస్య ప్రాంతాల్లో నిల్వలు చేసి రాత్రిళ్లు పట్టణాలకు తరలిస్తున్నారు.

పెబ్బేరు మండలం రంగాపురం, రాంపురం, గుమ్మతండా, జనుంపల్లి వాగు పరీవాహక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఖిల్లాఘనపురం మండలం మామిడిమాడ నుంచి కొత్తపల్లి శివారు వరకు ఉన్న పిల్లవాగు (పెద్దవాగు) నుంచి ఒకటి, రెండు ట్రిప్పులకు అనుమతులు తీసుకొని రాత్రిదాకా అక్రమంగా తరలిస్తూ దందా కొనసాగిస్తున్నారు.

పెద్దమందడి మండలం చిల్కటోనిపల్లి, వెల్టూరు, గోపాలసముద్రంలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.

ఊకచెట్టువాగును అనుసరించి ఉన్న కొత్తకోట మండలం పాతజంగమాయపల్లి, పాంపురం, మదనాపురం, శంకరంపేట వాగుల నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

వనపర్తి పట్టణంలోని వశ్యతండా శివారు పొలాల్లో ఓ నాయకుడు మట్టిని ఫిల్టర్‌ చేసి ఇసుకగా మార్చి విక్రయిస్తున్నారు. అలాగే వనపర్తి మండలంలోని ఖాసీంనగర్‌, కిష్టగిరి, పెద్దగూడెంతండాల్లోని వాగుల్లో ఫిల్టర్‌ ఇసుక దందా జోరుగా సాగుతోంది.

విజృంభిస్తున్నఇసుక అక్రమార్కులు

మట్టినీ వదలని వైనం

పొక్లెయిన్ల సాయంతో తవ్వకాలు

రహస్య ప్రదేశాల్లో నిల్వలు

తూంకుంట, రంగాపూర్‌, ఊకచెట్టు వాగుల నుంచి తరలింపు

కేసులు నమోదు చేస్తాం..

రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు బైండోవర్‌ చేయడానికి కూడా వెనకాడబోం. ప్రభుత్వ అనుమతులతో ఇసుక రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

– ఆనంద్‌రెడ్డి, డీఎస్పీ, వనపర్తి

నిల్వచేసిన ఇసుకను వాహనంలో నింపుతున్న పొక్లెయిన్‌ (ఫైల్‌)
1/2

నిల్వచేసిన ఇసుకను వాహనంలో నింపుతున్న పొక్లెయిన్‌ (ఫైల్‌)

2/2

Advertisement
Advertisement