డబుల్‌ పునః పరిశీలన | Sakshi
Sakshi News home page

డబుల్‌ పునః పరిశీలన

Published Mon, Apr 17 2023 1:12 AM

పెద్దగూడెంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు  - Sakshi

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌

వార్డుల వారీగా జాబితా..

దరఖాస్తుదారుల జాబితాను వార్డుల వారీగా ప్రకటించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి అర్జీ పెట్టుకొని జాబితాలో పేరు లేకపోయినా అప్పటి రసీదును చూపిస్తే నమోదు చేసుకుంటాం. సోమవారం నుంచి బుధవారం వరకు రసీదులు అందజేయాలి. కొత్తగా దరఖాసుతలు తీసుకోం. జాబితాలో అనర్హులే అధికంగా ఉన్నారని.. రీ సర్వే చేయాలని పుర పాలకవర్గం చేసిన విజ్ఞప్తి మేరకు కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

– రాజేందర్‌గౌడ్‌, తహసీల్దార్‌, వనపర్తి

రీ వెరిఫికేషన్‌ చేయమన్నాం..

అధికారులు ప్రకటించిన జాబితాలో చాలా వరకు అనర్హుల పేర్లే ఉన్నాయి. మరోసారి రీ వెరిఫికేషన్‌ చేసి అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను అభ్యర్థించాం. మా అభ్యర్థన మేరకు కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అసలైన లబ్ధిదారులకు మేలు చేయాలనే తాపత్రయంతో వినతిపత్రం ఇచ్చాం.

– గట్టుయాదవ్‌, పుర చైర్మన్‌, వనపర్తి

మొదట ప్రకటించిన జాబితాపై

పుర పాలకవర్గం తీవ్ర అభ్యంతరం

ఇతర శాఖల సిబ్బందితో దరఖాస్తుల రీ వెరిఫికేషన్‌కు చర్యలు

వనపర్తిటౌన్‌: పుర పరిధిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పురపాలికలో కాకరేపింది. అఽధికార పార్టీకి చెందిన చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌తో పాటు ఆ పార్టీకి కౌన్సిలర్లు పలువురు అధికారులు ప్రకటించిన జాబితాలో అనర్హులే అధికంగా ఉన్నారని.. తప్పుడు సర్వే చేశారని ఆరోపిస్తూ ఈ నెల 11న కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌కు వినతిపత్రం అందజేయడంతో డబుల్‌ ఇళ్ల ప్రక్రియపై సందిగ్ధం నెలకొంది.

ఇదీ కథ..

జిల్లాకేంద్రంలో నిర్మించిన 543 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించి అధికారులు ఈ నెల 5న 1,428 మంది అర్హుల జాబితాను ప్రకటించారు. ఇందులో ఇళ్లు ఉన్న వారు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు, ఉద్యోగస్తుల సంబంధించిన కుటుంబీకులు ఉన్నట్లు ఆరోపణలు తలెత్తడంతో పాటు అతి తక్కువ సంఖ్యలో అర్హులు కూడా ఉన్నారు. దీంతో ఈ నెల 20 నాటికి లక్కీడిప్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడటంతో అర్హులు, ఆశ పడిన అనర్హులు అయోమయంలో పడ్డారు.

సర్వే కొనసాగింది ఇలా..

పుర అధికారులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో ఏర్పాటుచేసిన 33 వార్డు బృందాలు గతేడాది సెప్టెంబర్‌ 29 నుంచి ఈ ఏడాది జనవరి 15 వరకు వచ్చిన 3,508 దరఖాస్తులను వార్డుల వారీగా సర్వే చేసి 2,066 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయగా టీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆధార్‌కార్డు ప్రామాణికంగా అందులో 1,428 మందిని అర్హులు గుర్తించడంతో పాటు తిరస్కరించిన 638 దరఖాస్తులకు సంబంధించిన కారణాలను సైతం జాబితాలో ప్రదర్శించారు. అధికారులు ప్రకటించిన అర్హుల జాబితాలో అనర్హులే అధికంగా ఉన్నారని.. సర్వేలో ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని, పకడ్బందీగా చేయలేదని పాలకవర్గం ఆరోపిస్తుండటంతో అధికారుల నిబద్ధతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నాయులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధు లు, సాధారణ ప్రజలు జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని ఫోన్లు చేసి సర్వే టీమ్‌లను ఆరా తీస్తుండగా.. నిబంధనల ప్రకారమే చేశామని, తమ పొరపాటు లేదని, ఇదంతా తహసీల్దార్‌ కార్యాలయం నుంచే జరిగిందని చెబుతుండటం గమనార్హం.

రీ వెరిఫికేషన్‌కు కలెక్టర్‌ ఆదేశం..

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం పుర పరిధిలోని 33 వార్డుల్లో 3,508 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాతో సంబంధం లేకుండా కలెక్టర్‌ ఆదేశాల మేరకు త్వరలో వార్డుల వారీగా దరఖాస్తుదారుల జాబితాను ప్రకటించనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని అధికారులకు పత్రాలు అందజేయని వారినుంచి కూడా మరోసారి పత్రాలు స్వీకరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే పుర అధికారుల పాత్రను చాలావరకు తగ్గించి ఇతర మండలాల నుంచి అధికారుల బృందాలను రప్పించి మరోసారి వార్డుల వారీగా రీ వెరిఫికేషన్‌ చేసి అర్హుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకే కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కలెక్టర్‌ ఆదేశాలతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు దరఖాస్తు చేసుకొని అధికారులకు ఇవ్వలేకపోయిన వారికి మరో అవకాశం దక్కనుంది. రీ వెరిఫికేషన్‌తోనైనా ఈ వేడి తగ్గుతుందో లేదో వేచి చూడాలి మరి.

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు (ఫైల్‌)
1/3

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు (ఫైల్‌)

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement