Telangana Crime News: మద్యం దుకాణాలకు.. బినామీల సునామీ..!
Sakshi News home page

మద్యం దుకాణాలకు.. బినామీల సునామీ..!

Published Mon, Sep 4 2023 1:00 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కొన్ని మద్యం దుకాణాలు వరించాయి. ఇందులో జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు దుకాణాలు వచ్చిన ప్రాంతాల్లో మద్యం విక్రయించడానికి కొంత షేర్‌ కావాలంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సామాన్యులు దక్కించుకున్న దుకాణాలను సైతం కైవసం చేసుకునే పనిలో లిక్కర్‌ డాన్‌లు బిజీగా ఉన్నారు. రెండేళ్లపాటు మీకు సక్రమంగా నిర్వహించడానికి రాదని.. మీకు ఎంతో కొంత ఇస్తాం.. వ్యాపారం మేము చేస్తాం అంటూ నయానో.. భయానో సొంతం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఇటీవల మద్యం దుకాణాలు లక్కీడిప్‌ ద్వారా ఇతరులకు దక్కిన వాటిని చేజిక్కించుకునేందుకు లిక్కర్‌ కింగ్‌లు రంగంలోకి దిగారు. ఇప్పటికే పాత దుకాణాల్లో డిమాండ్‌ ఉన్న వాటిలో అంటిపెట్టుకోవడానికి గుడ్‌విల్‌తోపాటు ప్రత్యేక షేర్‌లు అడుగుతున్నారు.

కల్తీ మద్యం విక్రయాల్లో ఆరితేరిన కొందరు వ్యాపారులు గుడ్‌విల్‌ ఇచ్చి ఎలాగైనా దుకాణాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో దుకాణానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు గుడ్‌విల్‌ చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఈ వ్యాపారంలో ఆ స్థాయిలో లాభాలు ఉన్నాయా అనే చర్చ మరోసారి ఇటు వ్యాపారుల్లో, అటు ప్రజల్లో సాగుతోంది. కల్తీ మద్యంలో ఆరితేరిన వ్యాపారులే దుకాణాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారీ స్థాయిలో విక్రయాలు..
ఉమ్మడి జిల్లాలోని 230 మద్యం దుకాణాలలో విక్రయాలు గణనీయంగా ఉన్నాయి. ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తులే ఇక్కడ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈసారి దుకాణాలు లక్కీడిప్‌లో ఇతరులకు దక్కినా.. లాభాలు రుచిమరిగి ఉండటంతో పాత వ్యాపారులు మళ్లీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఉండే బెల్టు షాపులకు దుకాణాల నుంచే మద్యం సరఫరా చేస్తారు.

అయితే ప్రభుత్వం అందించే మద్యం విక్రయిస్తే ఎక్కువగా లాభం ఉండకపోవడంతో ఈ బెల్టు దుకాణాలు కల్తీ మద్యం విక్రయాలకు అడ్డాగా మారాయి. కల్తీ మద్యాన్ని కొందరు వ్యాపారులే సరఫరా చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లాలోని కొందరు మద్యం వ్యాపారులకు మహారాష్ట్రలోని నాందేడ్‌, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారుచేసే వ్యాపారులతో సంబంధాలు ఉండటంతోనే ఉమ్మడి జిల్లాలో కల్తీమద్యం ఏరులై పారుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

మరికొన్నిచోట్ల మండలాల్లోనే మద్యం వ్యాపారులు తమ పలుకుబడి ఎక్కువగా ఉండే గ్రామాలను కల్తీ చేసేందుకు ఎంచుకుంటున్నారు. మద్యంలో రంగునీళ్లు కలిపి అన్ని బెల్టు షాపులకు పంపిణీ చేస్తున్నారు. బ్రాండెడ్‌ మద్యం సీసాల సీల్‌ విప్పి తిరిగి వేసే యంత్రాలు సైతం కొందరి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాపారంలో పేరుగాంచిన వ్యక్తులు అధిక లాభాలు ఉండటం వల్ల దుకాణాలు ఎవరికి వచ్చినా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

చట్టప్రకారం నేరం..
లక్కీడిప్‌లో దుకాణం సొంతం చేసుకుని రిజిష్టర్‌లో సంతకం చేసిన వారి పేరిటే లైసెన్స్‌ ఇస్తాం. నవంబర్‌ 25 వరకు కొత్త దుకాణదారులకు లైసెన్స్‌ జారీ చేస్తాం. గుడ్‌విల్‌ ఇచ్చి దుకాణాలు తీసుకోవడం చట్టప్రకారం నేరం. అలా చేసుకున్న వారికి దుకాణంపై ఎలాంటి హక్కులు ఉండవు. ఎకై ్సజ్‌ శాఖ నుంచి లైసెన్స్‌ తీసుకున్న వారే మద్యం దుకాణాలు నడపాలి. అమ్మకాల్లో ఏదైనా సమస్య వస్తే మద్యం దుకాణ లైసెన్స్‌ ఎవరి పేరుపై ఉంటే వాళ్లే బాధ్యులు అవుతారు. భవిష్యత్‌లో ఎలాంటి ఘటనలు జరిగినా లైసెన్స్‌ ఉన్న వ్యక్తులపైనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – దత్తరాజ్‌గౌడ్‌, ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement