వరద జలాలు రాకుంటే.. గడ్డుకాలమే | Sakshi
Sakshi News home page

వరద జలాలు రాకుంటే.. గడ్డుకాలమే

Published Wed, Oct 4 2023 12:46 AM

సోమశిల సమీపంలో కృష్ణానదిలో నీటిమట్టం ఇలా..  - Sakshi

కొల్లాపూర్‌: వర్షాకాలంలో నిండుకుండలా ఉండాల్సిన కృష్ణానది ఈ ఏడాది కళ తప్పింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద జలాలు రాకపోవడంతో నదిలో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాది శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో నీటమట్టం తక్కువ మొత్తంలో కనిపిస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే రబీ సీజన్‌లో పంటల సాగు కష్టతరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

854 అడుగుల ఎత్తులోనే..

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ఫుల్‌ గేజ్‌ లెవల్‌ 885 అడుగులు. ఈ మేరకు నీటి నిల్వలు ఉంటే కృష్ణానది ప్రవాహం వెంట ఉండే పుష్కర ఘాట్లన్నీ నీటితో కళకళలాడుతాయి. ఆగస్టు నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నిండుకుండలా ఉంటుంది. ఈ సమయంలోనే వరద జలాలను తెలంగాణలోని కేఎల్‌ఐ ప్రాజెక్టుతోపాటు, ఏపీలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు రెగ్యులర్‌గా కొనసాగుతుంటాయి. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా రోజుకు 0.2 టీఎంసీ, పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 0.5 టీఎంసీల నీటి పంపింగ్‌ చేస్తారు. కానీ, ఈ ఏడాది శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ సెప్టెంబర్‌లో 854 అడుగులు దాటలేదు. ఈ మొత్తం మరో నెలలో భారీగా తగ్గే అవకాశం ఉంది. 885 అడుగుల ఎత్తులో బ్యాక్‌ వాటర్‌ నీళ్లుంటే 215 టీఎంసీలు నదిలో ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం 856 అడుగుల ఎత్తులో నీళ్లుంటే బ్యాక్‌వాటర్‌లో కేవలం 94.45 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఇక 800 అడుగుల వరకు మాత్రమే కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. నాలుగురోజుల క్రితం ఎగువ నుంచి కొంత వరద రావడంతో నార్లాపూర్‌ వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పంప్‌ నుంచి 1.5టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.

రోజురోజుకూ తగ్గుతున్నాయి..

కృష్ణానదిలో సెప్టెంబర్‌లో సోమశిల, మంచాలకట్ట, జటప్రోల్‌ ప్రాంతాల్లో నీళ్లు నిండుకుండలా ఉంటాయి. కానీ, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయి. రోజురోజుకూ నీళ్లు తగ్గిపోతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండగా.. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాం. పైనుంచి వరద రాకపోవడం వల్లే నదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. – గోపినాయుడు, మంచాలకట్ట

సెప్టెంబర్‌లోనే జలకళ తప్పిన కృష్ణానది

శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా తగ్గిన నీటినిల్వ

రోజురోజుకూ తగ్గిపోతున్న బ్యాక్‌వాటర్‌

ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడే ఈ పరిస్థితి

ఈ సారి యాసంగిలోసాగునీటికి తప్పని కష్టాలు

సాగుకు కష్టాలే..

కృష్ణానదికి వరదలు రాకుంటే రబీ సీజన్‌లో పంటల సాగు కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నదిలో ఉన్న నీటి నిల్వ లెక్కల ప్రకారం రోజుకు 0.2 టీఎంసీల చొప్పున ఖరీఫ్‌ సాగు అవసరాలకు కేఎల్‌ఐ ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఈ లెక్కన ఖరీఫ్‌ ముగిసే నాటికి సాగు, తాగునీటి అవసరాలకు 6 టీఎంసీల నీటినే వాడుకునే అవకాశం ఉంది. రబీ సీజన్‌ ప్రారంభం నాటికి నదిలో నీటి నిల్వలు 830 నుంచి 810 అడుగులకు తగ్గిపోతే కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. దీంతో పంటల సాగుకు నీటి విడుదల ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. గత ఎనిమిదేళ్ల తర్వాత ఈసారే అలాంటి పరిస్థితి వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఆయకట్టు రైతులకు ఇక్కట్లు

శ్రీౖశెలం బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి కేఎల్‌ఐ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మించారు. పాలమూరు ప్రాజెక్టు ఇటీవలనే ప్రారంభమైన నేపథ్యంలో దీనిద్వారా సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతలు చేపట్టేందుకు ఇంకా అనుమతులు రాలేదు. ప్రస్థుతానికి తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఎత్తిపోతలకు అనుమతులు ఉన్నాయి. కేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 3.40 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు రబీసీజన్‌లో ఇక్కట్టు ఎదురుకానున్నాయి. బ్యాక్‌వాటర్‌ లెవల్స్‌ తగ్గితే సాగునీటికి నీటి విడుదల నిలిపివేస్తారు. కేవలం తాగునీటి మాత్రమే ఎత్తిపోతలు కొనసాగుతాయి. దీంతో యాసంగి సీజన్‌లో కేఎల్‌ఐ ఆయకట్టు రైతాంగానికి ఇక్కట్లు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

తక్కువ మొత్తంలో వరద..

ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వరదలు జూలై, ఆగస్టులో వస్తుంటాయి. కానీ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా వరద జలాలు తక్కువగా వచ్చాయి. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల తక్కువ మొత్తంలో కొనసాగుతుంది. అక్కడి నుంచి విద్యుదుత్పత్తి కేంద్రాలకు నీటి సరఫరా చేయడంతోపాటు నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తారు. అయితే శ్రీశైలానికే అనుకున్న స్థాయిలో వరదలు లేకపోవడంతో నాగార్జునసాగర్‌కు విడుదల చేయలేదు.

ఈసారి సాగునీరు కష్టమే..

కృష్ణానదిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నీటిమట్టం సెప్టెంబర్‌లోనే తగ్గిపోయింది. ఎగువ నుంచి వరదలు రాకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ 854 అడుగుల ఎత్తులో ఉంది. కేఎల్‌ఐ ద్వారాా రోజువారీగా నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. ఖరీఫ్‌ సాగుకు అవసరమైన నీళ్లను అందిస్తాం. ఈ 15 రోజుల్లో వరదలు రాకుంటే యాసంగి సీజన్‌లో సాగునీరివ్వడం కష్టమే. – శ్రీనివాసరెడ్డి,

ఈఈ, నీటిపారుదలశాఖ

1/2

2/2

Advertisement
Advertisement