43 తిరస్కరణ | Sakshi
Sakshi News home page

43 తిరస్కరణ

Published Tue, Nov 14 2023 1:34 AM

అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లు పరిశీలిస్తున్న ఆర్‌ఓ ఎస్‌.తిరుపతిరావు, అధికారులు  - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/వనపర్తి: ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. షాద్‌నగర్‌ మినహా 13 నియోజకవర్గాల్లో కలిపి 266 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 43 మంది నామినేషన్లను తిరస్కరించారు. 223 మందికి ఆమోదం తెలపగా.. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన సోమవారం అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.తిరుపతిరావు సారధ్యంలో పూర్తయ్యింది. 19 మంది అభ్యర్థులు మొత్తం 39 సెట్ల నామినేషన్లు గడువులోపు దాఖలు చేసిన విషయం తెలిసిందే.పరిశీలన అనంతరం ఐదుగురు నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించగా.. బరిలో 14 మంది ఉంటారని ఆర్‌ఓ ప్రకటించారు. తిరస్కరణకు గల కారణాలతో ఆయా అభ్యర్థులకు ప్రొసిడింగ్స్‌ జారీ చేశారు. నోటీసు బోర్డులోనూ ఉంచినట్లు ఆయన వెల్లడించారు. కొల్లాపూర్‌లో 21 మంది అభ్యర్థుల్లో ముగ్గరివి, మక్తల్‌లో 15 మంది అభ్యర్థుల్లో ముగ్గరి నామినేషన్లు తిరస్కరించారు. కాగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో రెండు చోట్ల ఓటు ఉందని కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డిపై ఫిర్యాదు రావడంతో ఉత్కంఠకు దారి తీసింది. చివరికి రాత్రి 7 గంటల సమయంలో ఆయన నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు జోడించలేదని మిగతా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. చివరికి ఆమోదం తెలిపారు.

ముగిసిన నామినేషన్ల పరిశీలన

కారణాలివే..

పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ఒకటే సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన ఓమేష్‌గౌడ్‌ ప్రతిపాదించిన వారిలో ఒక్కరి సంతకం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు మూడుసెట్ల నామినేషన్లు దాఖలు చేసిన పూరి సురేష్‌ శెట్టి అఫిడవిట్‌లో ఖాళీలు ఉండటం.. నామినేషన్‌ పత్రాల్లోనూ లోపాలున్నాయి. బీజేపీ తరఫున ఒకసెట్‌, స్వతంత్ర అభ్యర్థిగా మరోసెట్‌ నామినేషన్లు దాఖలు చేసిన డి.నారాయణను అభ్యర్థిగా ప్రతిపాదించిన వారిలో ఒకరి పేరు ఓటరు జాబితాలోని పేరుతో సరిపోలేదు. బీఎస్పీ నుంచి, స్వతంత్ర అభ్యర్థిగా ముడుసెట్లు నామినేషన్లు దాఖలు చేసిన చెన్నరాములు ప్రతిపాదించే వారి సంతకాలు లేవు. ఒక నామినేషన్‌ సెట్‌లో అభ్యర్థి సంతకం లేకపోవటంతో అన్నింటిని తిరస్కరించారు. ఘన సమాజ్‌ పార్టీ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన విజేయుడు గుర్తింపు లేని పార్టీ కావటంతో ప్రతిపాదించే వారు పది మంది ఉండాల్సి ఉండగా.. ఒక్కరితో నామినేషన్‌ దాఖలు చేసిన కారణంగా తిరస్కరించారు.

నామినేషన్లు ఆమోదం పొందిన అభ్యర్థులు..

బీజేపీ నుంచి అనుజ్ఞారెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మేఘారెడ్డి, బీఎస్పీ నుంచి మైబూస్‌, డీఎస్పీ నుంచి ఎల్లయ్య, ప్రజా ఎక్తాపార్టీ నుంచి సూర్యప్రకాష్‌, అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అర్జున్‌లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు రాములు, బాలస్వామి, రజినికాంత్‌, రామకృష్ణ, రుక్మంగాధర్‌, దయానంద్‌, వెంకటరమణ, రామకృష్ణారెడ్డి ఉన్నారు.

13 నియోజకవర్గాల్లో 223 మందికి ఆమోదం

వనపర్తిలో ఐదుగురు, కొల్లాపూర్‌లో 18 మంది..

దేవరకద్ర ఆర్‌ఓ కార్యాలయంలో హైడ్రామా

15 వరకు ఉపసంహరణకు గడువు

వనపర్తి నియోజకవర్గం చరిత్రలో తొలిసారిగా ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్టానం అధికారిక ప్రకటన తర్వాత మార్పులు చేసింది. దీంతో ముందు మురిసిపోయి తర్వాత నిరుత్సాహానికి గురైన అభ్యర్థులు, వారి మద్ధతుదారులు పోటీలో ఉండవచ్చనే అనుమానాలకు నామినేషన్ల, పరిశీలనల ఘట్టం ముగియటంతో తెరపడినట్‌లైంది.

1/1

Advertisement
Advertisement