ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు బీజేపీవే | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు బీజేపీవే

Published Sat, Nov 11 2023 1:36 AM

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌   - Sakshi

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

హన్మకొండ: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని, ఉమ్మడి జిల్లాలో 10 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర సమాచార, యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. శుక్రవారం హనుమకొండ విద్యుత్‌ నగర్‌లోని బీజేపీ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని, యువతకు ఉద్యోగాలివ్వకుండా మోసం చేశారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. మద్యం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని తేలిందన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా జైలులో ఉన్నాడని. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని, రూ.40 కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును రూ.1.30 లక్షల కోట్లకు పెంచుకున్నారని, ఇందులో సీఎం కేసీఆర్‌ పెద్దఎత్తున పర్సంటేజీలు తీసుకున్నారని ఆరోపించారు. నాణ్యతాలోపంతోనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు దేశిని సదానందంగౌడ్‌, కొలను సంతోశ్‌రెడ్డి, గుజ్జుల వసంత, గైనేని రాజన్‌, మాచర్ల కుమారస్వామి పాల్గొన్నారు.

Advertisement
Advertisement