సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

Published Tue, Nov 14 2023 1:14 AM

వివరాలు తెలుసుకుంటున్న షణ్ముగ రాజన్‌  - Sakshi

ఖిలా వరంగల్‌ / వరంగల్‌ అర్బన్‌: సమస్యాత్మక (క్రిటికల్‌) పోలింగ్‌ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు షణ్ముగ రాజన్‌ సూచించారు. వరంగల్‌ (తూర్పు) 106 నియోజకవర్గ పరిధిలోని వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలాల పరిధిలోని పలు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను రిటర్నింగ్‌ అధికారి, బల్దియా కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషాతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పోలింగ్‌ బూత్‌ల్లో ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజన్‌ మాట్లాడుతూ తూర్పులో మొత్తం 231 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, వాటిలో 57 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. అదనపు కేంద్ర బలగాల మోహరింపు, లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఏఆర్వోలు ఇక్బాల్‌, నాగేశ్వర్‌రావు, ఏసీపీ బోనాల కిషన్‌, ఇన్‌స్పెక్టర్లు ముస్క శ్రీనివాస్‌, సురేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు రాజేష్‌ కుమార్‌ సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వరంగల్‌ (తూర్పు) – 106 నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, బల్దియా కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషాతో నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో చేపట్టిన కార్యాచరణ ప్రణాళికపై సోమవారం చర్చించారు. వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 230 పోలింగ్‌ కేంద్రాల్లో 57 సమస్యాత్మక (క్రిటికల్‌) పోలింగ్‌ కేంద్రాలుగా ఇప్పటికే గుర్తించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement