బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ రాజ్యం | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ రాజ్యం

Published Wed, Nov 22 2023 1:12 AM

- - Sakshi

బుధవారం శ్రీ 22 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

సాక్షి, మహబూబాబాద్‌/ మరిపెడ/ మరిపెడ రూరల్‌: ‘యాడియే.. బాయియే.. బహెనో.. రాం..రాం’ అందరూ బాగుండాలి. మంచి పాలన అందాలంటే తెలంగాణను పోరాడి సాధించుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాలి. బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ రాజ్యం సాధ్యం’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో జరిగిన డోర్నకల్‌ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ఏళ్లుగా గిరిజనులు తమ తండాలో తమరాజ్యం కావాలని ఆకాంక్షించారని, గత పాలకులు పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్‌ పాలనలో 3500 తండాలను పంచాయతీలుగా ప్రకటించామన్నారు. డోర్నకల్‌ నియోజకర్గంలోని 82 తండాల్లో గిరిజనులే పాలన సాగిస్తున్నారన్నారు. తన గురించి, పైరవీల గురించి ఆలోచించకుండా ప్రజల కోసమే పని చేసే రెడ్యానాయక్‌ వంటి నాయకుడు పాలించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. సీనియర్‌ నాయకుడిగా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. నాకు మంచి సలహాదారుడిగా ఉంటున్న రెడ్యానాయక్‌ను మళ్లీ గెలిపించాలని, నూతన ప్రభుత్వంలో మంచి హోదా కల్పించే బాధ్యత నాదని కేసీఆర్‌ ప్రకటించారు.

కురవి వీరభద్రుడు పవర్‌ఫుల్‌..

నియోజకవర్గంలోని కురవి వీరభద్రుడు పవర్‌ఫుల్‌ దేవుడు అని కేసీఆర్‌ అన్నారు. ఉద్యమ సమయంలో వీరన్నకు మొక్కి ముందుకెళ్లానని, తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత బంగారు కోరమీసం చెల్లించి మొక్కులు తీర్చుకున్నానని గుర్తుచేశారు. దేవుడే కాదు.. ఈ ప్రాంత ప్రజలు కూడా మంచి చైతన్యవంతులు అన్నారు. ఇదే చైతన్యంతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు.

కాల్వలతో ధాన్యం రాశులు

గత పాలకులు కాల్వలు తవ్వారు. కానీ ఏనాడూ చుక్కనీరు పారించలేదని కేసీఆర్‌ అన్నారు. వెన్నవరం కాల్వకు రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌ పట్టుపట్టి సాగునీరు వచ్చేలా కృషి చేశారని పేర్కొన్నారు. దీంతో నాడు నీళ్లు లేక కాల్వలను చూస్తే కన్నీరు వచ్చేదని, ఇప్పుడు నిండా పారుతున్న కాల్వలతో ధాన్యపురాశులు పండుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిర్మించిన ప్రాజెక్టులతో రాష్ట్రంలో 3కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ధాన్యం ఉత్పత్తి 4కోట్ల టన్నులకు చేరుతుందని వివరించారు. సభలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నవీన్‌రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సీనియర్‌ నాయకులు నూకల నరేశ్‌రెడ్డి, రామసహాయం రంగారెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, డీఎస్‌ రవిచంద్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సింధూర, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ శారద, వేణుగోపాల్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్న, అయూబ్‌ పాషా, చాపల యాదగిరిరెడ్డి, మహేందర్‌రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉర్రూతలూగించిన గులాబీల జెండలు పాట

ఏపూరి సోమన్న కళా బృందం సభ్యులు పాటలు పాడుతూ సభికులను ఉత్సాహపరిచారు. గులాబీల జెండల పాటకు స్టేజీపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌, మానుకోట ఎంపీ మాలోతు కవిత, మహిళా ప్రజాప్రతినిధులు నృత్యాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సభ ముగియడంతో ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మళ్లీ గెలిపిస్తే మరింత సేవ చేస్తా:

రెడ్యానాయక్‌

ఇంతకాలం ప్రజల దీవెనలు, ఆశీస్సులతో డోర్నకల్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, మళ్లీ గెలిపిస్తే మరింత సేవ చేస్తానని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో మరిపెడలో 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేయించుకున్నామని చెప్పారు. మళ్లీ మన ప్రభుత్వం రాగానే మరిపెడ రెవెన్యూ డివిజన్‌, డోర్నకల్‌లో 100 పడకల ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించుకుందామన్నారు. మాకుల వేంకటేశ్వరస్వామి దేవాలయానికి రూ.5కోట్లు, నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.

న్యూస్‌రీల్‌

సీఎం కేసీఆర్‌ సభ సైడ్‌లైట్స్‌

మధ్నాహ్నం 3:30 గంటలకు: సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం హెలికాప్టర్‌.. వేదిక చుట్టూ ఒక రౌండ్‌ చక్కర్లు.

3:37 గంటలకు : హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

3:43 గంటలకు : హెలిపాడ్‌ నుంచి బస్సులో వేదిక వద్దకు..

3:49 గంటలకు : సీఎం ప్రసంగం ప్రారంభం

4:09 గంటలకు : ప్రసంగం ముగింపు

4:16 గంటలకు : హెలికాప్టర్‌లో సీఎం సూర్యాపేట వైపు పయనం..

రెడ్యానాయక్‌ సీనియర్‌ నాయకుడు, నాకు మంచి సలహాదారు

మళ్లీ గెలిపిస్తే మంచి హోదా కల్పిస్తా..

గిరిజనుల కోరిక మేరకు తండాలను

గ్రామ పంచాయతీలుగా చేశాం

కాల్వలను చూసి కన్నీరు పెట్టుకున్న

చోటే.. ధాన్యపురాశులు పండుతున్నాయి

ఉద్యమ సమయంలో

వీరన్నకు మొక్కి ముందుకెళ్లా..

రాష్ట్రం సాధించాక స్వామికి

కోరమీసం మొక్కు చెల్లించా

డోర్నకల్‌ నియోజకవర్గ

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌, పక్కన అభ్యర్థి రెడ్యానాయక్‌
1/4

సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌, పక్కన అభ్యర్థి రెడ్యానాయక్‌

2/4

మరిపెడలో జరిగిన డోర్నకల్‌ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం
3/4

మరిపెడలో జరిగిన డోర్నకల్‌ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం

4/4

Advertisement
Advertisement