ప్రత్యర్థుల కదలికలు, ప్రచార సరళిపై వేగుల ఆరా.. | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థుల కదలికలు, ప్రచార సరళిపై వేగుల ఆరా..

Published Wed, Nov 22 2023 1:12 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

సెంబ్లీ ఎన్నికల సమరానికి తెరపడేందుకు మరో ఎనిమిది రోజులే సమయం ఉంది. అంతకు రెండు రోజుల ముందే ప్రచారఘట్టం ముగియనుంది. ఈ నెల 30న పోలింగ్‌ జరగనుండగా అభ్యర్థుల గెలుపో.. ఓటమో డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది. ఈనేపథ్యంలో ఓ వైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే.. మరోవైపు ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టేందుకు అభ్యర్థులు ‘వేగుల’ను నియమించుకున్నారు. ఒకరిని చూసి ఒకరు ఒక్కో నియోజకవర్గంలో సుమారు 150 నుంచి 200 మందిని నియమించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడం కోసం అస్త్రశస్త్రాలను సంధిస్తున్న అభ్యర్థులు.. రోజువారీగా రాత్రి 9 నుంచి 10.30 గంటల్లోపు వేగులు ఇచ్చే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని మరుసటి రోజు ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు.

ప్రత్యర్థుల కదలికలు, ప్రచార సరళిపై దృష్టి

పార్టీలో చురుకై న నాయకులు, కార్యకర్తలతోపాటు డిగ్రీ, పీజీ పూర్తయిన విద్యార్థులను వేగులుగా ఉపయోగించుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించి టీఆర్‌ఎస్‌వీ, యూత్‌ విభాగం కార్యకర్తలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పరిస్థితిని అంచనా వేసి అభ్యర్థులకు చేరవేస్తున్నారు. పోటీ పార్టీల అభ్యర్థుల ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు, జన సమీకరణ ఫొటోలు వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా అభ్యర్థుల ప్రచార సరళి, ప్రజల నుంచి వస్తున్న స్పందనతోపాటు నిరసనలు, నిలదీతలను రిపోర్టు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ సర్వే బృందాల పేరిట వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల పరకాల, ములుగు, జనగామ, వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి, డోర్నకల్‌ తదితర నియోజకవర్గాల్లో ఈ బృందాలు తిరిగి పార్టీ హైకమాండ్‌కు నివేదిక కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థుల ప్రచారసరళిపై ఆ పార్టీ సీనియర్‌లు బృందాలుగా ఏర్పడి ఒక జిల్లాకు చెందిన వారు మరో జిల్లాలో తిరుగుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు కూడా అభ్యర్థుల కదలికలు, ప్రచారసరళిని గమనించడంతోపాటు.. వారు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నారో కూడా అంచనా వేసి తగు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఒకరిపై ఒకరు.. కోవర్టులు, అసంతృప్తులపై ఆరా

అభ్యర్థుల కోసం పనిచేస్తున్న వేగులు పార్టీలో కార్యకర్తలుగా ఉంటూనే కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించే పనిలోనూ ఉన్నారు. పార్టీలు మారే ఆలోచనలో ఉన్న వారిని సైతం గుర్తిస్తున్నారు. పొద్దంతా పార్టీ అభ్యర్థితో ఉంటూనే రాత్రివేళల్లో పోటీ అభ్యర్థులు, వారి అనుచరులతో ‘సిట్టింగ్‌’వేసి గుట్టు విప్పుతున్న వారినీ గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించిన వారిని అభ్యర్థులు మందలించడంతో పార్టీలు మారిన వారు కూడా ఉన్నారు. ఇటీవల గ్రేటర్‌ వరంగల్‌లో ఓ కీలకనేత, ఇద్దరు కార్పొరేటర్లు పార్టీలు మారారు కూడా. అంతకు ముందు పరకాల, భూపాలపల్లి, డోర్నకల్‌, జనగామ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్టీలో ఉంటూ అసంతృప్తితో రగిలిపోయే వారిని గుర్తించి జాబితాను కూడా తయారు చేసి అభ్యర్థులకు అందజేస్తుండగా... ఆ మరుసటి రోజే అసంతృప్తులను కలిసి బుజ్జగించి వెంట తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో గూఢాచారులను నియమించుకుని ఎప్పటికప్పుడు కోవర్టులు, అసంతృప్తులను నివారించడంలో సఫలమవుతున్న అన్ని పార్టీల అభ్యర్థులు మరో పది రోజులు ఈ వ్యవస్థను కొనసాగించనున్నారు. అభ్యర్థులకు చాపకిందనీరులా పనిచేస్తున్న వేగుల వ్యవస్థ.. ప్రభుత్వాలకు ‘ఇంటెలిజెన్స్‌’లా ఉపయోగపడుతోందన్న చర్చ జరుగుతోంది.

ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్‌లో సమాచారం

జంపింగ్‌ జపాంగ్‌లపై ఆరా.. అనుమానం వస్తే నిఘా

అసంతృప్తుల వివరాలు సేకరణ.. పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు

కేడర్‌ను బట్టి రేటు ఫిక్స్‌.. అభ్యర్థుల ఆమోదంతో చేరికలు

ఉమ్మడి వరంగల్‌లో చాపకింద నీరులా పనిచేస్తున్న వైనం

Advertisement
Advertisement