సైన్స్‌ ఎగ్జిబిషన్‌, ఇన్‌స్పైర్‌కు ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

సైన్స్‌ ఎగ్జిబిషన్‌, ఇన్‌స్పైర్‌కు ఏర్పాట్లు

Published Fri, Dec 8 2023 12:46 AM

- - Sakshi

కాళోజీ సెంటర్‌ : జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌, ఇన్‌స్పైర్‌ మనాక్‌ ఈనెల రెండో వారంలో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, సైన్స్‌ గైడ్‌ టీచర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 10–15 సంవత్సరాల వయస్సు గల 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రయోగాల వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇన్‌స్పైర్‌ మనాక్‌ పేరుతో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. అంకుర సంస్థల స్థాపనకు ప్రధానమంత్రి కలల ప్రాజెక్టు స్టార్టప్‌ ఇండియా దిశగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగాలు, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనల దిశగా 2023–24 విద్యాసంవత్సరానికి ఇన్‌స్పైర్‌ అవార్డు మనాక్‌ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో చేపట్టింది. వచ్చిన ప్రాజెక్టుల నుంచి లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. ప్రాజెక్టు తయారీకి ప్రతి విద్యార్థికి రూ.10 వేల చొప్పున ఖాతాలో జమ చేస్తారు.

ఆన్‌లైన్‌లో ప్రాజెక్టుల అప్‌లోడ్‌..

ఇన్‌స్పైర్‌ అవార్డు మనాక్‌ 2023–24లో భాగస్వాములు కావడానికి ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 31 వరకు విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో 121 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. జిల్లాస్థాయిలో జరిగే ఇన్‌స్పైర్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు ఎంపిక చేసిన విద్యార్థులను త్వరలో జరుగనున్న జిల్లా ప్రదర్శనలో పాల్గొనేలా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు

5 ఉప అంశాల ఎంపిక..

ఆరోగ్యం, లైఫ్‌ (లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌, అగ్రికల్చర్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, కంప్యూటేషనల్‌ థింకింగ్‌ అంశాలను ఎంపిక చేశారు. ఇవే కాకుండా ప్రధానాంశానికి అనుగుణంగా ఏదైనా నూతన ఆవిష్కరణలు చేయవచ్చు.

రెండో వారంలో ఇన్‌స్పైర్‌ ప్రదర్శన

జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శన, జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఈనెల రెండో వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ గైడ్‌ టీచర్లకు ఆదేశాలు జారీ చేశాం. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులను సిద్ధంగా ఉంచాలని సూచించాం. వివరాలకు 9848878455 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలి.

– డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, జిల్లా సైన్స్‌ అధికారి

రెండో వారంలో నిర్వహణకు అధికారుల సన్నాహాలు

విద్యార్థులను సిద్ధం చేయాలని

హెచ్‌ఎంలు, గైడ్‌ టీచర్లకు ఆదేశాలు

1/1

Advertisement
Advertisement