ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం | Sakshi
Sakshi News home page

ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం

Published Mon, Mar 11 2024 5:20 AM

వరంగల్‌ ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు - Sakshi

వరంగల్‌ అర్బన్‌: ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం.. ధనిక రాష్ట్రాన్ని పదేళ్లలో రూ.7లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పారు.. అందరి ఆశలు, ఆకాంక్షలు, కోరికలు నెరవేరుతాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ మహా నగర అభివృద్ధిలో భాగంగా ఆదివారం ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌ ప్రాంగణంలో రూ.280.85కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ, నగర మేయర్‌ సుధారాణి, ఎమ్మెల్యేలతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల్లో ఇప్పటికే నాలుగు లబ్ధిదారులకు చెంతకు చేరాయన్నారు. ప్రజల మనసులో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం(నేడు) ప్రారంభిస్తారని, ఎన్నికల నియమావళి రాకముందే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కేవలం 72 రోజుల్లో 31 వేల కొలువులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ సర్కారుకే దక్కుతుందన్నారు. 75 రోజుల్లోనే సుమారు 11,600 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇచ్చామని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించి మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ఏంకావాలో తెలుసుకున్నాం.. మీ కోరికలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని ఆయన వివరించారు.

ఉద్యోగులకు ఒకటి నుంచి మూడో తేదీలోగా జీతాలు ఇస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు జరుగుతున్న మేలును చూసి ఓర్వలేని ఎమ్మెల్సీ కవిత అవాకులు, చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోదని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు, సీనియర్‌ సిటిజన్స్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.19 లక్షల చెక్కులు, దివ్యాంగులకు 12 ద్విచక్రవాహనాలు, 5 బ్యాటరీ వీల్‌చైర్‌ వాహనాలు పంపిణీ చేశారు.

అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయి

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు

చేసిన కేసీఆర్‌

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

వరంగల్‌ నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో..

హన్మకొండ: వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుంకుస్థాపన చేశారు. హనుమకొండ సమ్మయ్యనగర్‌ వద్ద స్మార్ట్‌ సిటీ నిధులు రూ.2 కోట్లతో చేపట్టే కాజీపేట, ఫాతిమా క్వాలిటీ కంట్రోల్‌ డివిజన్‌, టీటీడీ జంక్షన్‌ అభివృద్ధి పనులు, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.76.35 కోట్లతో చేట్టనున్న సమగ్ర వరదకాలువల నిర్మాణం, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2 కోట్లతో హనుమకొండ బాలసముద్రంలోని బాలబాలికలు, వికలాంగుల ఉద్యానవనం ఆధునికీకరణ పనులకు మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనుసూయ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement