ఖేలో ఇండియా క్రీడాకారుల సత్తా | Sakshi
Sakshi News home page

ఖేలో ఇండియా క్రీడాకారుల సత్తా

Published Sat, Sep 23 2023 12:50 AM

- - Sakshi

జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాల పంట

ఏలూరు రూరల్‌: ఏలూరులో రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా సెంటర్‌ (ఎస్‌టీసీ)కు పూర్వ వైభవం వచ్చింది. రెండేళ్లుగా ఈ సెంటర్‌ క్రీడాకారులు పలు పోటీల్లో పతకాల పంట పండిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి ఔరా అనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సెంటర్‌ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో సెంటర్‌లో జాతీయస్థాయి మౌళిక వసతులు ఏర్పాటయ్యాయి. దీంతో క్రీడాకారుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కోచ్‌ల పర్యవేక్షణలో అథ్లెటిక్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లో రాటుదేలుతున్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) పేరుతో ఏర్పాటైన ఈ సెంటర్‌ నేడు ఎస్‌టీసీ పేరుతో నడుస్తోంది. 16 నుంచి 21 ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. ప్రభుత్వం క్రీడాకారులకు ఉచిత విద్య, వైద్యం, వసతి, భోజనంతో పాటు బీమా సైతం అందిస్తోంది.

పతకాలు సాధిస్తున్న బాలికలు

జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సెంటర్‌ లిఫ్టర్లు ప్రతిభ చాటుతున్నారు. కోచ్‌ వి.ఉదయ్‌సందీప్‌ వద్ద శిక్షణ పొందుతున్న యు.లక్ష్మీప్రసన్న 2022లో యూపీలో జరిగిన ఖేలో ఇండియా జూనియర్‌, సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో కాంస్య పతకం సాదించింది. 2023 జూన్‌ 6నుంచి 13 వరకూ మధ్యప్రదేశ్‌లో 66వ స్కూల్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రేవతి 75 కేజీల విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుంది. అండర్‌–16 అథ్లెటిక్స్‌ విభాగంలో వి.భార్గవి జావెలిన్‌ త్రో, షాట్‌ఫుట్‌లో రెండు బంగారు పతకాలు సాధించింది. జి.నీలిమ 20 ఏళ్ల విభాగం జావెలిన్‌ త్రోలో మరో బంగారు పతకం చేజిక్కించుకుంది. ఎం.మానస సైతం రజతం, కాంస్యం సాధించగా, ఇదే క్రీడాంశంలో బి.షాలిని మరో రజతం సొంతం చేసుకుంది.

సత్తా చాటిన బాలురు

ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 26 వరకూ పంజాబ్‌ రాష్ట్రం పాటియాలలో ఆల్‌ ఇండియా స్టేట్‌ లెవల్‌ ఖేలో ఇండియా సెంటర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ఎస్‌టీసీ అథ్లెట్లు పతకాల పంట పండించారు. ఎస్‌.లక్ష్మణ్‌ 400 మీటర్ల హర్డిల్స్‌ను 54.36 సెకన్లతో పూర్తి చేసి బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. ఇదే పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో లతిఫ్‌, 110 మీటర్ల హర్డిల్స్‌లో శామ్యూల్‌రాజ్‌, 800 మీటర్ల పరుగులో రాకేష్‌ మెరిశారు. బాలుర విభాగంలో కె.ధనుష్‌ ట్రయథ్లాన్‌, 60 మీటర్ల పరుగు పోటీల్లో రెండు బంగారు పతకాలు గెలిచాడు. మరోపక్క హేమర్‌త్రో అంశంలో పి.వెంకటేష్‌ హేమర్‌త్రోలో మరో బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. వీరితో పాటు సీహెచ్‌ ఈశ్వర్‌, డి.కార్తీక్‌, జి.గణేష్‌, కె.దినేష్‌, కార్తీక్‌ పవన్‌ సైతం రజత, కాంస్య పతకాలు సాధించారు.

పతకాలు సాధించిన అథ్లెట్లు

జాతీయస్థాయి మౌలిక వసతులు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఎస్‌టీసీ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేశాం. సెంటర్‌ లోపల ప్రత్యేక జిమ్‌ ఏర్పాటు చేశాం. మొత్తంగా 43 మంది క్రీడాకారులకు జాతీయస్థాయి మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతిరోజూ శిక్షణ అందిస్తున్నాం. అథ్లెట్లు, లిఫ్టర్లు జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకాలు సాధిస్తున్నారు.

– డీఎన్‌వి వినాయక ప్రసాద్‌, సెంటర్‌ ఇన్‌చార్జ్‌

వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన ఎ.రేవతి
1/3

వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన ఎ.రేవతి

జాతీయ స్థాయి 400 మీటర్ల హర్డిల్స్‌లో పతకం సాధించిన లక్ష్మణ్‌
2/3

జాతీయ స్థాయి 400 మీటర్ల హర్డిల్స్‌లో పతకం సాధించిన లక్ష్మణ్‌

3/3

Advertisement
Advertisement