దోపిడీ యత్నం కేసులో ఐదుగురి అరెస్టు | Sakshi
Sakshi News home page

దోపిడీ యత్నం కేసులో ఐదుగురి అరెస్టు

Published Tue, Nov 14 2023 12:26 AM

స్వాధీనం చేసుకున్న చెక్క తుపాకీ, కత్తులు  - Sakshi

తణుకు: వేల్పూరులో ఈ నెల 8వ తేదీన జరిగిన దోపిడీ యత్నం కేసులో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులను తణుకు రూరల్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ సి.శరత్‌రాజ్‌కుమార్‌ చెప్పారు. ఆదివారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దువ్వ గ్రామంలో కార్ఖానా నడుపుతున్న కాంట్రాక్టర్‌ బలరామ్‌ వద్దకు ఉత్తరప్రదేశ్‌ నుంచి మహ్మద్‌ సాధిక్‌, ఉస్మాన్‌ షఫి, షాలేఆలమ్‌, మహ్మద్‌ అర్షద్‌లతోపాటు మరో బాలుడు వడ్రంగి పనిచేసేందుకు వచ్చారు. వేల్పూరు గ్రామంలోని బాలాజీనగర్‌కు చెందిన వృద్ధుడు బండా బాబూరావు ఇంట్లో రెండేళ్ల క్రితం వీరిలో కొందరు వడ్రంగి పని చేశారు. దాదాపు మూడు నెలల పాటు అక్కడే పనిచేశారు. అయితే ఇటీవల ఉస్మాన్‌షఫీను తీసుకుని అదే ఇంటికి పాలిష్‌ పెట్టేందుకు వెళ్లారు. ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఉండటం గమనించిన వీరు షాలేఆలమ్‌, మహ్మద్‌ అర్షద్‌లతోపాటు మరో బాలుడు కలిసి బాబూరావు ఇంట్లోకి చొరబడి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా చెక్క తుపాకీ తయారు చేసుకుని ఈనెల 8న సాయంత్రం బాబూరావు ఇంటికి వెళ్లారు. కాలింగ్‌ బెల్‌ కొట్టగానే బయటకు వచ్చిన బాబూరావును తమతో తెచ్చుకున్న చెక్క తుపాకీ, కత్తులతో బెదిరించారు. బాబూరావు వారిని ప్రతిఘటించగా, అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంతలో బాబూరావు భార్య కేకలు వేయడంతో వీరు పరారయ్యారు. ఘటనపై బాధితులు తణుకు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్‌ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు, ఎస్సై కె.చంద్రశేఖర్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాబూరావు ఇంట్లో సీసీ ఫుటేజీతోపాటు సాంకేతికతను ఉపయోగించి నిందితులు దువ్వలో ఉంటున్నట్లు గుర్తించారు. అయితే వీరంతా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దొంగతనాలకు ప్రణాళిక చేసినట్లుగా తెలిసింది. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి చెక్క తుపాకీ, రెండు కత్తులు, నాలుగు సెల్‌ఫోన్లు, తాడు, ప్లాస్టర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శరత్‌రాజ్‌కుమార్‌ చెప్పారు. హెచ్‌సీ కేవీ సుబ్బారావు, కానిస్టేబుళ్లు జె.అరుణ్‌కుమార్‌, మలకా శ్రీను, వి.మాధవ్‌, పీసీఆర్‌ శ్రీనులను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శరత్‌రాజ్‌కుమార్‌
1/1

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శరత్‌రాజ్‌కుమార్‌

Advertisement
Advertisement