డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ఉక్కుపాదం

Published Wed, Nov 15 2023 12:38 AM

- - Sakshi

ప్రాణాలకు ముప్పు

మద్యపానం వల్ల అనేక లక్షల జీవితాలు నాశనమవుతున్నాయి. మద్యం మత్తులో డ్రైవింగ్‌ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఇతరులు ప్రాణాలకు ఆపద వాటిల్లుతుంది. ఇటీవల యువతలో మద్యం సేవించడం ఫ్యాషన్‌గా మారింది. రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి కృషిచేస్తూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేస్తున్నాం. వాహనాలదారుల్లో అవగాహన కల్పిస్తున్నాం.

– యు.రవిప్రకాష్‌, ఎస్పీ, భీమవరం

సాక్షి, భీమవరం: మద్యం తాగి వాహనాలు నడిపేవారికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో పకడ్బందీగా తనిఖీలు జరుగుతున్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిని గుర్తించిన పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపైనా కేసులు నమోదుచేసి కోర్టుకు పంపుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 373 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాల్టీల్లోని 25 పోలీసుస్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపే(డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌) వారిపై 2,679 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే(ఓపెన్‌ డ్రింకింగ్‌) వారిపై 15,301 కేసులు నమోదుచేశారు.

అవగాహన కార్యక్రమాల నిర్వహణ

జిల్లాలో ప్రజల భద్రత, నేర నియంత్రణలో భాగంగా ప్రతిరోజు విజిబుల్‌ పోలీసింగ్‌ విధానాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రధాన సెంటర్లలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పిస్తూ జరిమానా విధించకుండా అక్కడికక్కడే హెల్మెట్‌ కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వల్ల మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ప్రతి రోజు రెండు గంటలపాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

1/1

Advertisement
Advertisement