సమ సమాజ స్థాపకుడు అంబేడ్కర్‌ | Sakshi
Sakshi News home page

సమ సమాజ స్థాపకుడు అంబేడ్కర్‌

Published Thu, Dec 7 2023 12:48 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక అధికారి 
కె.కన్నబాబు, కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులు  - Sakshi

తాడేపల్లిగూడెం అర్బన్‌: బీఆర్‌ అంబేడ్కర్‌ సమసమాజ స్థాపకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నారన్నారు. వలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించారన్నారు. సుమారు రూ.500 కోట్లతో అంబేడ్కర్‌ స్మృతి వనం ఏర్పాటు చేయడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిరకాలం నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరు మన దేశానికి వచ్చినా అంబేద్కర్‌ స్మృతివవనాన్ని తప్పనిసరిగా సందర్శిస్తారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ యూత్‌ లీడర్‌ కొట్టు విశాల్‌, తెన్నేటి జగ్జీవన్‌, చీకటిమిల్లి మంగరాజు, చింతా వెంకటరావు, జోగేంద్ర పాల్గొన్నారు.

తుపాను ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్‌

భీమవరం(ప్రకాశంచౌక్‌): తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి ప్రత్యేక అధికారి కె.కన్నబాబు, కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ యు.రవిప్రకాష్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ సుందర్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తుపాను ప్రభావం, చేపడుతున్న సహాయచర్యలపై సీఎంకి జిల్లా కలెక్టర్లు వివరించారు.

మూడ్రోజుల ప్రత్యేక కార్యాచరణ

భీమవరం (ప్రకాశంచౌక్‌): తుపాను ప్రభావిత ప్రాంతాలపై కార్యాచరణను రానున్న మూడు రోజులు పగడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధికారులతో సమావేశమై రానున్న మూడు రోజులు కార్యాచరణ అమలుకు చర్యలపై ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యానవన పంటల నష్టంపై సమగ్రంగా పరిశీలించి నివేదికను అందజేయాలని ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. ఇరిగేషన్‌ శాఖకు చెందిన ప్రతి ఉద్యోగి, అధికారి క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. గర్భిణి సీ్త్రలను నేడు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేలా చూడాలన్నారు. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా పరీక్షలతో పాటు, ఫీవర్‌ సర్వేను కూడా చేయించాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని, అవసరమైన చోట తాగునీటి వనరులను శుభ్రం చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

అంబేడ్కర్‌ సేవలు చిరస్మరణీయం

భీమవరం: అణగారినవర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ యు.రవిప్రకాష్‌ అన్నారు. బీఆర్‌ అంబేద్కర్‌ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంటరానితనంపై అంబేడ్కర్‌ అలుపెరగని పోరాటం చేశారని దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉండాలంటూ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్పీ రవిప్రకాష్‌
1/1

అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్పీ రవిప్రకాష్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement