జిల్లాలో 23,661 హెక్టార్లలో పంట నష్టం | Sakshi
Sakshi News home page

జిల్లాలో 23,661 హెక్టార్లలో పంట నష్టం

Published Thu, Dec 7 2023 12:48 AM

-

భీమవరం (ప్రకాశంచౌక్‌): తుపాను కారణంగా జిల్లాలో సుమారు 23,661 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, వివిధ మౌలిక వసతులు దెబ్బతినడం కారణంగా సుమారు రూ.188 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ పి.ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 19 మండలాల్లోని 113 గ్రామాలు తుపాను వల్ల తీవ్ర వర్షాలు, ఈదురు గాలుల తాకిడికి గురయ్యాయని తెలిపారు. 19 గ్రామాలలో, నాలుగు మున్సిపాలిటీలలోని కొన్ని ప్రాంతాల్లో నీరు చేరిందని, దీని కారణంగా 4,090 మంది ప్రజలు ప్రభావితం అయ్యారని తెలిపారు. మూడు పక్కా గృహాలు, 11 కచ్చా గృహాలు పూర్తిగా దెబ్బతినగా.. 12 కచ్చా గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. 79 గృహాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని చెప్పారు. పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు సుమారు రూ.14 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. పదిమందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. 32 పశువుల పాకలు దెబ్బతినగా సుమారు రూ.3.2 లక్షల నష్టం వాటిలిందన్నారు. 6,354 ఆహార పొట్లాలను, 15,336 వాటర్‌ ప్యాకెట్లను అందజేశామన్నారు. 31 మెడికల్‌ క్యాంపులను నిర్వహించి సేవలు అందించామన్నారు. 423.53 కిలోమీటర్ల మేర ఆర్‌ అండ్‌ బీ రహదారులు దెబ్బతిన్నాయని, 20 చెట్లు కూలిపోయాయని, 3 ఆర్‌ అండ్‌ బీ రహదారులపై నీరు చేరిందని, రెండు చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం కలిగిందని తెలిపారు. రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు సుమారు రూ.11 కోట్లు ఖర్చవుతుందని, శాశ్వత నిర్మాణాలకు రూ.165 కోట్ల ఖర్చు కాగలదన్నారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి 9.7 కిలోమీటర్ల మేర 6 రోడ్లు దెబ్బతినగా తాత్కాలిక మరమ్మతులకు సుమారు రూ.42 లక్షలు, శాశ్వత నిర్మాణాలకు రూ.130 లక్షలు ఖర్చు కాగలదన్నారు. మూడు అర్బన్‌ ప్రాంతాల్లోని 17.7 కిలోమీటర్ల మేర రహదారులు, 5.4 కిలోమీటర్ల మేర ఓపెన్‌ డ్రెయిన్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయిన్లు, 702 వీధి దీపాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 16 ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్మాణాలు దెబ్బతినగా, వాటి పునరుద్ధరణకు సుమారు రూ.53 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు.

పాలకొల్లులో 346 మి.మీ. వర్షపాతం

భీమవరం: తుపాను కారణంగా జిల్లావ్యాప్తంగా సరాసరి బుధవారం 183.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పాలకొల్లులో 346.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఆకివీడులో 226.8, గణపవరంలో 223.6, ఇరగవరంలో 208.6, నరసాపురంలో 205.2, కాళ్లలో 204 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడేపల్లిగూడెంలో 143, పెంటపాడులో 163.6, తణుకులో 169.2, అత్తిలిలో 157.6, ఉండిలో 176.6, పాలకోడేరులో 142.4, పెనుమంట్రలో 157.2, పెనుగొండలో 152.6, ఆచంటలో 162.6, పోడూరులో 166.6, వీరవాసరంలో 197.6, భీమవరంలో 174, మొగల్తూరులో 163.6, యలమంచిలిలో 130.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సమాచార శాఖ తెలిపింది

Advertisement
Advertisement