సత్వరమే పంట నష్టం అంచనా వేయాలి | Sakshi
Sakshi News home page

సత్వరమే పంట నష్టం అంచనా వేయాలి

Published Fri, Dec 8 2023 12:48 AM

పోడూరు: పెనుమదంలో ముంపు చేలను పరిశీలిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి 
 - Sakshi

నరసాపురం రూరల్‌: అధికారులు పంట నష్టం అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ఆదేశించారు. గురు వారం మండలంలోని చిట్టవరం, గొంది, కొత్తనవరసపురం, పాతనవరసపురం గ్రామాల్లో ఆయన పర్యటించి నీట మునిగిన వరి పొలాలు, కుళ్లిన వరి దుబ్బులను పరిశీలించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఎకరాకూ నష్టపరిహారం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పొలాల్లోని ముంపు నీటిని ఇంజిన్ల ద్వారా బయటకు మళ్లించే ఏర్పాటు చేసుకుంటే ఆయిల్‌ ఖర్చులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. పంట బోదెలు, కాలువల్లో ఉపాధి హామీ కూలీలతో పూడిక తీయించే పనులు చేయిస్తున్నామన్నారు. రైతులే స్వయంగా పొక్లయిన్ల సాయంతో మురుగు డ్రెయిన్లను బాగుచేసుకుంటే ప్రభుత్వమే నిధులు ఇస్తుందన్నారు. దాళ్వా సాగుకు తక్కువ రోజుల్లో పంట దిగుబడి వచ్చే వంగడాలను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సాగు చేసుకోవాలన్నారు. వీటితో పాటు దెబ్బతిన్న ఇళ్లు, కొబ్బరి చెట్లు, ఉద్యాన పంటలు తదితర వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చీఫ్‌ విప్‌ ముదునూరి అధికారులను ఆదేశించారు. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమాని నాగరాజు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, జెడ్పీటీసీ బొక్కా రాధాకృష్ణ, ఉంగరా రమేష్‌నాయుడు, తహసీల్దార్‌ ఫాజిల్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన వెంట ఉన్నారు.

ప్రతి రైతునూ ఆదుకుంటాం

పోడూరు: మిచాంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన ప్రతిఒక్క రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని వైఎస్సార్‌ సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి అన్నారు. పెనుమదం, వద్దిపర్రు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి దెబ్బతిన్న వరిచేలను, పెనుమదంలో అల్లిపర పంటబోదె ప్రక్షాళన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావం వల్ల నియోజకవర్గవ్యాప్తంగా రైతులకు నష్టం వా టిల్లిందన్నారు. రైతులెవ్వరూ అధైర్యపడవద్దనీ, అన్నివిధాలా ఆదుకోవడానికి సీఎం జగన్‌ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారన్నారు. మండల కన్వీనర్‌ పితాని చిన్న, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పెదపాటి పెద్దిరాజు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ యడ్ల తాతాజీ, సొసైటీ చైర్మన్‌ కొర్రపాటి వీరాస్వామి, గ్రామకమిటీ అధ్యక్షుడు గెద్దాడ ఏసు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు

నరసాపురం రూరల్‌: వేములదీవిలో బాధితులతో మాట్లాడుతున్న చీఫ్‌ విప్‌ ముదునూరి
1/1

నరసాపురం రూరల్‌: వేములదీవిలో బాధితులతో మాట్లాడుతున్న చీఫ్‌ విప్‌ ముదునూరి

Advertisement
Advertisement