మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు | Sakshi
Sakshi News home page

మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు

Published Tue, Jan 2 2024 5:54 PM

Becareful Harassers - Sakshi

మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్‌ శ్రీకాంత్‌ మిరియాల. ఆయన ట్విట్టర్‌ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా..

నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి?

వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు.

ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి.

ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు.

కొన్ని గుర్తుపెట్టుకోండి.

1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు.

2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు.

3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు.

4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు.

5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి.


డాక్టర్‌ శ్రీకాంత్‌ మిరియాల

Advertisement

తప్పక చదవండి

Advertisement