ఇంటర్‌ పరీక్షలకు సిద్ధం | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు సిద్ధం

Published Tue, Mar 14 2023 5:58 AM

పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి  - Sakshi

భువనగిరి : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 13,309 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది.

పరీక్ష కేంద్రాలు ఇలా..

జిల్లా వ్యాప్తంగా 69 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 11 ప్రభుత్వ, 29 వివిధ రకాల రెసిడెన్సియల్‌, 29 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 31 కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో ప్రభుత్వ 11, మోడల్‌ 5, టీఎస్‌ఆర్‌డబ్ల్యూఎస్‌లో 5, ప్రైవేట్‌ కళాశాలల్లో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోత్కూర్‌ సెంటర్‌లో ఏ, బీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట, సర్వేల్‌, రాజాపేటలో సెల్ఫ్‌ సెంటర్లు ఉన్నాయి.

విద్యార్థుల వివరాలు

పరీక్షలకు 13,309 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం 6,206 మందికి గాను జనరల్‌ 4,684, ఒకేషనల్‌ 1,522 మంది ఉన్నారు. సెకండియర్‌ 7,103 మంది విద్యార్థులకు జనరల్‌ విభాగం 5,569, ఒకేషనల్‌ 1,534 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు 31 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 31 డీఓలను నియమించారు. వీరితో పాటు 3 కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

నిమిషం నిబంధన

పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. విద్యార్థులు నిర్ణీత సమయానికి కంటే ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి సెల్‌ఫోన్‌లు, వాచ్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు.

144 సెక్షన్‌ అమలు

పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. పరీక్ష జరిగే సమయంలో జిరాక్స్‌ సెంటర్లను మూసివేయనున్నారు. వీటితో పాటు పరీక్ష కేంద్రాల్లో విద్యుత్‌, నీటి సౌకర్యం, వెలుతురు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షల సమయానికి ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, హాజరైన అధికారులు

రేపటి నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ

వరకు పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలు

హాజరుకానున్న 13,309 మంది

విద్యార్థులు

నిమిషం ఆలస్యమైనా

అనుమతి నిరాకరణ

సాక్షి,యాదాద్రి : విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. సోమవానం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమావేశమై ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని సూచించారు. ప్రైవేట్‌ కశాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా హాల్‌ టికెట్‌లు జారీ చేయాలని ఆదేశించారు. అదే విధంగా 9121147135, 08685 – 293312 నంబర్లతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే సమాచారం అందజేయవచ్చన్నారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా హైదరాబాద్‌ నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొని పరీక్షల ఏర్పాట్లపై మంత్రికి వివరించారు.

ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 8.30నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తాం నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించం. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాం.

– రమణి, డీఐఈఓ

1/1

Advertisement
Advertisement