Sakshi News home page

ఈతకు వెళ్లి మృత్యు ఒడిలోకి..

Published Fri, Mar 17 2023 1:56 AM

సాత్విక్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు  - Sakshi

నీటి కుంటలో మునిగి బాలుడు మృతి

నకిరేకల్‌లోని ఎర్రకుంట వద్ద ఘటన

నకిరేకల్‌: ఈతకు వెళ్లి బాలుడు మృతిచెందిన ఘటన నకిరేకల్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన నేలపట్ల శ్రీను, సరిత దంపతులు ఆరేళ్ల క్రితం నకిరేకల్‌కు వలస వచ్చి వీటీ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. శ్రీను రైస్‌ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సాయిచరణ్‌ స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో 6వ తరగతి, చిన్న కుమారుడు సాత్విక్‌(10) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. ఒంటి పూట బడులు కావడంతో గురువారం సాయిచరణ్‌, సాత్విక్‌ బడికి వెళ్లి మధ్యాహ్నమే ఇంటికి వచ్చారు. అనంతరం సాయిచరణ్‌ ఆడుకునేందుకు ఇంటి సమీపంలోని స్టేడియంలోకి వెళ్లగా, సాత్విక్‌ తన మిత్రులతో కలిసి ఈత కొట్టేందుకు సంతోష్‌నగర్‌ సమీపంలోని ఎర్రకుంట వద్దకు వెళ్లాడు. తోటి స్నేహితులు కుంటలోకి దిగి ఈత కొడుతుండగా, సాత్విక్‌ కూడా కుంట ఒడ్డున తన డ్రెస్‌, చెప్పులు విడిచి నీటిలోకి దిగాడు. కుంట లోతుగా ఉండటంతో ఈత రాక నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన అతడి స్నేహితులు భయంతో పరుగులు తీశారు. సాత్విక్‌ తల్లి కూడా తన కుమారుడు ఇంకా ఇంటికి రాలేదని వెతుక్కుంటూ ఎర్రకుంట వద్దకు చేరుకుని ఒడ్డున ఉన్న అతడి డ్రెస్‌, చెప్పులు గుర్తించి కన్నీరుమున్నీరయ్యింది. సాత్విక్‌ అమ్మమ్మ, తాతయ్య ఊరు కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం కాగా, మనవడి మృతదేహంపై పడి బన్నీ.. బన్నీ.. అంటూ తాత రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. సమాచారం అందుకున్న నకిరేకల్‌ ఎస్‌ఐ రంగారెడ్డి, ఫైర్‌ ఎస్‌ఐ భీముడు కుంట వద్దకు చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంగారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement