పుంజుకోని కొనుగోళ్లు | Sakshi
Sakshi News home page

పుంజుకోని కొనుగోళ్లు

Published Thu, Nov 9 2023 1:40 AM

కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని 
తూకం వేస్తున్న హమాలీలు - Sakshi

డిసెంబర్‌ 10లోగా పూర్తి చేస్తాం

ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్‌ 10వ తేదీలోపు పూర్తి చేస్తాం. ఎక్కడ అవసరం అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. నాన్‌ఆయకట్టులో వారం రోజుల్లో వరికోతలు ముమ్మరం కానున్నాయి. కొనుగోళ్లకు ఇబ్బందులు ఏర్పడకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నాం.

–అదనపు కలెక్టర్‌, భాస్కర్‌రావు

అవసరాల మేరకు

తేమ యంత్రాలు, టార్పాలిన్లు

కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం అవసరాల మేరకు తేమ యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నారు. అయితే రెండు, మూడు రోజుల్లో కేంద్రాలకు ధాన్యం రాక పెరిగితే అవకాశం ఉన్నందున ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సాక్షి, యాదాద్రి : వరికోతలు మొదలై వడ్లు కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు చేరుతున్నా కొనుగోళ్లు పుంజుకోవడం లేదు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా ఆశించినస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2,82,657 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 2.52లక్షల మెట్రిక్‌ టన్నుల పైచిలుకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 314 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా 290 కేంద్రాలు తెరిచారు. రూ.90 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి రూ.30 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు.

మూసీ వెంట ప్రత్యేక ఏర్పాట్లు

మూసీ పరివాహక మండలాలైన బీబీనగర్‌, భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో వరికోతలు దాదాపు చివరి దశకు చేరాయి. ఇక్కడ ముందస్తుగానే కోతలు మొదలు కావడంతో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా చౌటుప్పల్‌ ఆర్డీఓను నోడల్‌ అధికారిగా నియమించారు. అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేశారు.వీరంతా నిత్యం కేంద్రాలకు వెళ్తూ కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. అయినా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు చేసిన ధాన్యం ఇలా..

ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 290 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2.52లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 3,557 మంది రైతుల నుంచి ఏ గ్రేడ్‌ 34,479 మెట్రిక్‌ టన్నులు, సాధారణ రకం 7,931 మెట్రిక్‌ టన్నులు మొత్తం 42,410 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 123 మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.30 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

మబ్బులతో

మందగించిన కొనుగోళ్లు

జిల్లాలో ఓ వైపు వరి కోతలు, మరోవైపు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇదే తరుణంలో ఆకాశం మబ్బులు పడుతుండడం, అక్కడక్కడ చినుకులు రాలుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మబ్బులు పట్టడంతో ధాన్యంలో తేమశాతం పెరిగి రెండు రోజులుగా కొనుగోళ్లు మందగించాయి. రోజూ 7 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, మబ్బుల కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరగడంతో మూడు రోజులుగా కొనుగోళ్లు కొంతమేర తగ్గాయి.

నాన్‌ ఆయకట్టులో..

మూసీ ఆయకట్టులో వరి కోతలు చివరి దశకు చేరుతుండగా నాన్‌ ఆయకట్టులో మరో రెండు,మూడు రోజుల్లో ఊపందుకోనున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం ఉంది. దీనికి నాన్‌ ఆయకట్టు రైతులు తీసుకువచ్చే ధాన్యం తోడుకానుంది. అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.

ఫ ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్ల నిండా ధాన్యం

ఫ నాన్‌ ఆయకట్టులోనూ ఊపందుకోనున్న వరికోతలు

ఫ ఇబ్బందులు తలెత్తే అవకాశం

ఫ కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్న రైతులు

కొనుగోళ్లు ఇలా..

ప్రతిపాదిత

కేంద్రాలు 314

ప్రారంభించినవి

290

సేకరించాల్సిన ధాన్యం

2.52 లక్షల మెట్రిక్‌ టన్నులు

కొనుగోలు చేసింది

42,710 మెట్రిక్‌ టన్నులు

రైతులకు చెల్లించింది రూ.30 కోట్లు

బీబీనగర్‌ మండలం గుర్రాలదండిలో కాంటా వేసిన వడ్లను లారీలో లోడ్‌ చేస్తున్న హమాలీలు
1/2

బీబీనగర్‌ మండలం గుర్రాలదండిలో కాంటా వేసిన వడ్లను లారీలో లోడ్‌ చేస్తున్న హమాలీలు

2/2

Advertisement
Advertisement