పెయిడ్‌ పబ్లిసిటీ ! | Sakshi
Sakshi News home page

పెయిడ్‌ పబ్లిసిటీ !

Published Fri, Nov 17 2023 1:48 AM

- - Sakshi

జనబలం చూపించుకోవడానికి నాయకుల ఆర్భాటం

రోజువారి కూలీలకు పెరిగిన గిరాకీ

వారికి డబ్బులతోపాటు భోజనం

డప్పులు, డీజే, కోలాట కళాకారులకు సైతం మస్తు డిమాండ్‌

దురాజ్‌పల్లి (సూర్యాపేట) : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తూ.. జన బలం చూపించుకోవడానికి రాజకీయ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ప్రచారంలో ఆర్భాటం లేనిది ప్రజలు బయటికి రావడం లేదు. దీంతో నాయకులు జన సమీకరణకు ఎక్కువ పాధాన్యం ఇస్తుండటంతో రోజువారి కూలీలకు డిమాండ్‌ ఏర్పడింది. నాయకులు ఖర్చుకు వెనుకాడకుండా కూలీలను కార్యకర్తలుగా చూపుతున్నారు. వారికి భోజనంతో పాటు మద్యం సైతం అందిస్తున్నారు. డప్పు, కోలాట, జనపద కళాకారులు, డీజేలు, మైకులు, ఆటోలకు సైతం గిరాకీ ఉంటోంది. దీంతో డప్పు కళాకారులు పల్లెల నుంచి పట్నం బాటపట్టారు. ఇక కోలాట కళాకారులైతే గ్రామానికి ఒక గ్రూప్‌ తయారైంది. ప్రతి కళాకారుడికి వసతి కల్పించి కొంత మొత్తం ఇస్తుండటంలో వారంతా తీరిక లేకుండా పని చేస్తున్నారు.

జన బలం ఉండేలా..

ఎన్నికల పుణ్యమాని వివిధ రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు చాలా మందికి ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి. అన్ని పార్టీలు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తమ వెంట ఎవ్వరూ లేరు అనేది రాకుండా చూసుకుంటున్నాయి. ఇందుకోసం నాయకులు రోజువారి కూలీలను కార్యకర్తలుగా చూపుతూ వారిని ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. వీరికి రోజుకు పురుషులకు రూ.400, మహిళలకు రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. భోజన సౌకర్యం, రవాణా ఖర్చులు అదనం. దీంతో గ్రామాల్లో కూలీలు కనిపించడం లేదు. పంటలు చేతికందే సీజన్‌ కావడంతో వ్యవసాయ పనులకు కూలీలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

నాయకులకు బాధ్యతలు..

ఎన్నికల ప్రచారానికి జన సమీకరణ బాధ్యతను ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగిస్తున్నారు. గ్రామాల్లో జనంతో ఎక్కువగా మమేకమైన వారిని, నమ్మకమైన వ్యక్తులను ఎంచుకుంటున్నారు. వారే దగ్గరుండి ప్రచారం ముగిసే వరకు అన్ని చూసుకుంటున్నారు. కార్యకర్తలు తక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులను గుర్తించి ద్వితీయశ్రేణి నాయకులు ముందస్తుగానే పెయిడ్‌ కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement
Advertisement