Sakshi News home page

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్‌

Published Fri, Nov 17 2023 1:48 AM

సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం  - Sakshi

కోదాడ: సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో నిర్వహించిన మలి విడత తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర సాధన లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలను వదిలేసి సీఎం కేసీఆర్‌ కమీషన్ల కోసం పనికిరాని ప్రాజెక్టులను తెరమీదకు తెచ్చాడని విమర్శించారు. 60ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఉంటే రూ.లక్ష కోట్లు అప్పులు తెచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే మునిగిపోతుందన్నారు. పేపర్‌ లీకేజీలతో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఈ ఎన్నికల్లో ఆదరించాలని పిలుపునిచ్చారు. పందిరి నాగిరెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ కాంగ్రెస్‌ అభ్యర్థి నలమాద పద్మావతి, ధర్మార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి

నకిరేకల్‌: సీఎం కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని కోదండరాం పిలుపునిచ్చారు. గురువారం నకిరేకల్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధనకు కాంగ్రెస్‌ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశం, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి, రిటైర్డ్‌ అధ్యాపకుడు గోనారెడ్డి, టీజేఎస్‌ జిల్లా నాయకులు ధర్మార్జున్‌రెడ్డి, బీసీపీ జిల్లా కార్యదర్శి గాజుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం

Advertisement
Advertisement