కాంగ్రెస్‌కు కంచుకోటగా నల్లగొండ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు కంచుకోటగా నల్లగొండ

Published Wed, Dec 6 2023 12:58 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్తగా ఏర్పడనున్న రాష్ట్ర కేబినెట్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అధిక ప్రాధాన్యం దక్కనుంది. అత్యధికంగా మంత్రి పదవులతో పాటు పార్టీ పదవుల్లోనూ నల్లగొండకే ప్రాధాన్యం ఇచ్చేలా కాంగ్రెస్‌ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌ తరువాత అత్యధిక స్థానాలను ఇక్కడి నుంచి గెలిచిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎం పదవి ఆశించారు. అయితే, ఆ పదవిని రేవంత్‌రెడ్డికి ఇవ్వడంతో ఉత్తమ్‌కు మంత్రివర్గంలో కీలక పదవి అప్పగించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌కు కంచుకోటగా నల్లగొండ

నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం ప్రజలు కాంగ్రెస్‌ వైపే నిలిచారు. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. ఇందులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేతలు ఉన్నారు. మహబూబ్‌నగర్‌ తరువాత అత్యధిక స్థానాలను గెలిపించి ఇచ్చింది నల్లగొండ జిల్లానే. మహబూబ్‌నగర్‌ నుంచి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో మంత్రి పదవుల్లో అగ్ర తాంబూలం నల్లగొండ జిల్లాకే ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. మంత్రి పదవులతో పాటు పార్టీ పదవుల్లోనూ సముచిత ప్రాధాన్యం దక్కనుంది.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి

మంత్రి పదవి, పీసీసీ పీఠం?

నల్లగొండ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోనే సీనియర్‌ నాయకుడు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించడంతో పాటు, టీడీపీ ప్రభుత్వ హయాంలో నల్లగొండ నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ రహిత తాగునీరు అందించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన.. తెలంగాణ సాధన కోసం సొంత ప్రభుత్వం మీదనే పోరాడారు. మంత్రి పదవికి రాజీనామా చేసి నల్లగొండ పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అంతేకాదు తెలంగాణ కోసం రెండు పర్యాయాలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమోదించలేదు. ఆ తర్వాత ఆయన నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. సోనియా గాంధీ ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అవుతానని ఆయన గతంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మారిన సమీకరణల్లో భాగంగా వెంకట్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీఎం కాకపోయినా

కీలక బాధ్యతలే..

ఉమ్మడి జిల్లాలో మరో సీనియర్‌ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించడంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు. అఽధిష్టానం అన్ని విధాల చర్చించి రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక పదవి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాజగోపాల్‌రెడ్డికి కూడా..

మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతే. ఆయన ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు చీఫ్‌ విప్‌ లేదా ప్రభుత్వంలో మరో కీలక పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది.

ఫ పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యం

ఫ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి

మంత్రి పదవితో పాటు పీసీసీ పీఠం?

ఫ రాజగోపాల్‌రెడ్డికి కూడా కీలక పదవి

ఫ ఆ దిశగా కసరత్తు చేస్తున్న

కాంగ్రెస్‌ అధిష్టానం

Advertisement
Advertisement