పేద రోగులకు భరోసా! | Sakshi
Sakshi News home page

పేద రోగులకు భరోసా!

Published Mon, Dec 18 2023 1:32 AM

ఎయిమ్స్‌లోని ఓపీ విభాగం వద్ద బారులుదీరిన రోగులు - Sakshi

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు

బీబీనగర్‌ : బీబీనగర్‌లో ఏర్పాటైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నిరుపేదలకు వరంగా మారింది. ఎంతో ఖరీదైన కార్పొరేట్‌ వైద్యం ఇక్కడ అత్యంత చౌకధరలకే అందుతోంది. కేవలం పది రూపాయలకే సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు, ప్రత్యేక వైద్యనిపుణులు అందుబాటులో ఉండడంతో నానాటికీ రోగుల తాకిడి అధికమవుతోంది. యాదాద్రి భువనగిరి నుంచే కాకుండా హైదరాబాద్‌ జంటనగరాలు, మెదక్‌, సిద్ధిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, జనగాం, వరంగల్‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి రోగులు తరలివస్తున్నారు. రోజూ 2వేల మందికి పైగా ఎయిమ్స్‌లో వైద్య సేవలు పొందుతున్నారు.

దశలవారీగా విస్తరణ

నిరుపేదలకు మెరుగైన, అత్యాధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ఎయిమ్స్‌ పని చేస్తోంది. ఇందుకోసం దశలవారీగా సేవలను విస్తరిస్తున్నారు. 2020 జూన్‌ 2వ తేదీన 50 పడకల సామర్థ్యంతో ఎయిమ్స్‌ను ప్రారంభించారు. క్రమేణా రోగుల సంఖ్య పెరగడంతో 2021 డిసెంబర్‌లో 100 పడకలకు ఇన్‌పేషెంట్‌ సేవలను అందుబాటులో తీసుకువచ్చారు. కేవలం పది రూపాయలకే ఓపీడీ ఉండడం, ఈసీజీ, ఎక్స్‌రే తదితర పరీక్షలకు నామమాత్రపు ఫీజు వసూలు చేస్తుండడంతో ఎయిమ్స్‌కు రోజురోజుకూ ఆధరణ పెరుగుతోంది. రోగుల తాకిడి పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 100 పడకల ఇన్‌పేషెంట్‌ సేవలను మరో ఐదు నెలల్లో 350 పడకలకు మార్చే దిశగా ఎయిమ్స్‌ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం అవసరమయ్యే వైద్యులు, సిబ్బంది 300 పోస్టుల భర్తీకి కేంద్ర వైద్యారోగ్య శాఖ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న వివిధ విభాగాలకు సంబంధించిన భవనాలు అందుబాటులోకి రాగానే 700 పడకలకు ఆస్పత్రి సామర్థ్యం పెంచనున్నారు.

ఔట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ రోగులు ఇలా..

ఎయిమ్స్‌లో ప్రస్తుతం రోజూ 1,850 వరకు ఔట్‌పేషెంట్‌, 150 మంది వరకు ఇన్‌పేషెంట్‌ సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా రోగులు వైద్యసేవలు పొందినట్లు ఎయిమ్స్‌ అధికారులు చెబుతున్నారు.

నామమాత్రపు ఫీజుకే సూపర్‌ స్పెషాలిటీ

వైద్యం, పరీక్షలు

రోజురోజుకూ పెరుగుతున్న రోగుల తాకిడి

రెండేళ్లలో 4లక్షల మందికి పైగా సేవలు

350 పడకల విస్తరణకు సన్నాహాలు

రోగుల సంఖ్య పెరుగుతుంది

నిరుపేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అతిచౌక ధరకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం, వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఔట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ సేవల కోసం రోజూ 2వేల మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఇబ్బంది కలగకుండా సేవలందిస్తున్నాం. దశలవారీగా సేవలను విస్తరిస్తున్నాం. ప్రస్తుతం 100 పడకలతో ఉన్న ఇన్‌ పేషెంట్‌ సేవలను 350 పడకలకు పెంచే దిశగా చర్యలు చేపట్టాం. ఎయిమ్స్‌లో అందజేస్తున్న సూపర్‌ స్పెషాలటీ వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

– వికాస్‌ భాటియా, ఎయిమ్స్‌ డైరెక్టర్‌

అందుబాటులో ఉన్న వైద్యసేవలు..

ఎయిమ్స్‌లోని ప్రసుత్తం జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, అప్తమాలజీ, న్యూరా లజీ, కార్డియాలజీ, నెప్రాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రేడియాలజీ, పిడీయాట్రిక్‌, ఇంటెన్సివ్‌ కేర్‌, ప్రసూతి, పీఐసీయూతో పాటు ఎమర్జెన్సీ వైద్య సేవలను అందిస్తున్నారు. త్వరలో డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఎమ్‌ఆర్‌ఐ, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, ఈసీజీ, ఎక్స్‌రే, రక్త పరీక్షలతో పాటు మరికొన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్‌ స్థాయి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా జర్మనీ నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తెప్పించి సేవలందిస్తున్నారు.

ఎమర్జెన్సీ విభాగంలో సేవలు 
పొందుతున్న రోగులు
1/2

ఎమర్జెన్సీ విభాగంలో సేవలు పొందుతున్న రోగులు

2/2

Advertisement
Advertisement